ఆరెండు మున్సిపాలిటీలకు వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి

ఆరెండు మున్సిపాలిటీలకు వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు : మంత్రి వివేక్ వెంకటస్వామి

మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నామన్నారు  మంత్రి  వివేక్ వెంకటస్వామి. పట్టణంలోని 24 వార్డుల్లో ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీ పనులను వేగవంతం చేశామని.. వచ్చే డిసెంబర్  లోపే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. మందమర్రి, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలకు వెయ్యి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్. 

గత పదిహేను ఏళ్ల క్రితం.. దివంగత నేత కాకా వెంకటస్వామి హయాంలోనే ఈ ప్రాంత అభివృద్ధికి పునాదులు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మించాలని అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డితో పోరాడి.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాకా తీసుకొచ్చారని వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెన్నూరు నియోజకవర్గంలోని 55 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

 గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వివేక్ వెంకటస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 11 వేల కోట్ల రూపాయలతో ప్రారంభమైన ప్రాజెక్టును నిలిపివేసి.. కేవలం కమీషన్ల కోసమే కేసీఆర్ రీ-డిజైన్ పేరుతో కాళేశ్వరానికి మార్చారని విమర్శించారు. అంతేకాకుండా, రిటైర్డ్ కార్మికులకు చెల్లించాల్సిన 14 వేల కోట్ల రూపాయల బెనిఫిట్స్ ఇవ్వకుండా గత ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు.

ఇక ఇందిరమ్మ రాజ్యం లో భాగంగా.. మందమర్రి, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలకు వెయ్యి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా రెండో విడతలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేస్తామన్నారు. మందమర్రి పట్టణ సుందరీకరణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని అధికారులను ఆదేశిస్తూ.. అభివృద్ధిలో రాజీ పడే ప్రసక్తే లేదని వివేక్  తేల్చి చెప్పారు.