సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రిజైన్ చేయాలి.. మందమర్రిలో  మంత్రి వివేక్ ధర్నా

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రిజైన్ చేయాలి.. మందమర్రిలో  మంత్రి వివేక్ ధర్నా

మందమర్రి: ఏఐసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో పార్టీ నేతలు భారీ ఆందోళన నిర్వహించారు. మంత్రి  వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. అనంతరం మందమర్రి పాత బస్టాండ్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఓట్ల చోరీకి సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. 

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కేంద్రంలోని నరేంద్ర మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో సీఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లను తొలగిస్తున్నారని, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో ఓట్ల తొలగింపు కారణంగానే బీజేపీ విజయం సాధించిందని ఆయన ఆరోపించారు.

మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నారని మంత్రి వివేక్ విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తోందన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా దేశ ప్రజల కోసం పోరాడుతున్నారని వివేక్ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఐక్యంగా పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. సీఈసీ రాజీనామా చేసే వరకు నిరసనలు కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.