బీఆర్ఎస్ ఎగ్గొట్టిన హామీలతో కేసీఆర్ బాకీ కార్డు రిలీజ్

బీఆర్ఎస్ ఎగ్గొట్టిన హామీలతో కేసీఆర్ బాకీ కార్డు రిలీజ్
  • బీఆర్ఎస్ ఎగ్గొట్టిన హామీలతో విడుదల చేసిన మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం, అడ్లూరి 
  • డబుల్ ఇండ్లు, నిరుద్యోగ భృతి వంటివి ఏమైనవని ప్రశ్న
  •   డబుల్ ఇండ్లు, నిరుద్యోగ భృతి ఏమైనయ్?  
  • రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు   
  • పదేండ్లలో 8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఫైర్ 
  •  ప్రజలను బీఆర్ఎస్ మోసం చేసింది: మంత్రి వివేక్ వెంకటస్వామి  

 

జూబ్లీహిల్స్, వెలుగు: గత బీఆర్ఎస్​ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. మిగులు బడ్జెట్‌‌‌‌తో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని, పదేండ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఫైర్ అయ్యారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ఎగ్గొట్టిన హామీలతో రూపొందించిన ‘కేసీఆర్ బాకీ కార్డు’లను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌తో కలిసి విడుదల చేశారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలేవీ బీఆర్ఎస్ నెరవేర్చలేదని అన్నారు. డబుల్ బెడ్‌‌‌‌రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భృతి తదితర హామీలు అమలు చేయలేదన్నారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈసారి కాంగ్రెస్‌‌‌‌ను గెలిపిస్తే భవిష్యత్తులో అధిక నిధులు ఇస్తాం. అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా ఉంటాయి” అని పేర్కొన్నారు. బోరబండలో భారీ మెజార్టీ రావాలని పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ. అన్ని మతాలను, కులాలను సమానంగా చూస్తుంది. కార్యకర్తలు డోర్ టు డోర్ ప్రచారం చేసి ప్రజలకు నిజాలను తెలియజేయాలి” అని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, కాసుల మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

 
జూబ్లీహిల్స్ అభివృద్ధికి 140 కోట్లు ఇచ్చినం.. 

జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటివరకు రూ.140 కోట్లు కేటాయించినట్టు మంత్రి వివేక్​వెంకటస్వామి వెల్లడించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు , కమ్యూనిటీ హాల్స్​వంటి పనులు జరుగుతున్నాయని చెప్పారు. మంగళవారం రహమత్​నగర్​డివిజన్‌‌‌‌లోని రాజీవ్​గాంధీనగర్, ఇందిరానగర్​ఫేజ్​2, ప్రతిభానగర్, వినాయకనగర్​, బ్రహ్మశంకర్​నగర్, హెచ్ఎఫ్​నగర్​ఫేజ్​వన్, రహ్మత్​నగర్​బంగారు మైసమ్మ టెంపుల్​ప్రాంతాల్లో కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, నాలాలు, అంగన్​వాడీ కేంద్రాల నిర్మాణానికి సంబంధించి రూ.15.25 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ శంకుస్థాపన చేశారు. ఇందిరానగర్​ఫేజ్​టులో కమ్యూనిటీ హాల్​ను స్థానిక అధికారులతో శంకుస్థాపన చేయించారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ‘‘జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించాం. ముస్లిం మైనార్టీలు  కబరస్థాన్‌‌‌‌కు స్థలం కేటాయించాలని గతంలో నన్ను కోరారు. ఈ విషయం గురించి సీఎంతో కూడా చర్చించాం. వివాదాలకు తావు లేకుండా త్వరలో వారికి స్థలం కేటాయిస్తాం” అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, నవీన్​యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

450 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ

తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హబీబ్ ఫాతిమా నగర్ కమ్యూనిటీ హాల్‌‌‌‌లో ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి’ పథకం కింద అర్హులైన 450 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వీటిని మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధికి దూరమైంది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకం కింద మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నం. త్వరలో అన్ని నియోజకవర్గాల్లోనూ పంపిణీ చేస్తాం” అని వెల్లడించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. ‘‘మా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నది. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, సన్న బియ్యం అందజేస్తున్నం. మహిళలకు ప్రాధాన్యం కల్పించేలా ఉచిత బస్సు ప్రయాణం, సున్నా వడ్డీ రుణాలు వంటి పథకాలను ప్రవేశపెట్టాం” అని తెలిపారు.