- జీపీఎస్, డ్రోన్స్, శాటిలైట్ మ్యాపింగ్‌తో అక్రమ రవాణాకు చెక్: మంత్రి వివేక్
- ఆరు నెలల్లో ఇసుక రాయల్టీ ద్వారా 22 శాతం అదనపు ఆదాయం
- బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ లీడర్లు, కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టారు
- సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు
- శాండ్ బజార్, బీసీ గర్ల్స్ కాలేజ్, హాస్టల్‌ను ప్రారంభించిన మంత్రి
కోల్‌బెల్ట్/కోటపల్లి/చెన్నూరు, వెలుగు: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇసుక మాఫియాకు టెక్నాలజీతో అడ్డుకట్ట వేస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరులో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాండ్ బజార్‌ను, చెన్నూరులో బీసీ బాలికల కాలేజీ, హాస్టల్‌ను కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అలాగే, చెన్నూరు క్యాంపు ఆఫీస్‌లో రైతులకు సబ్సిడీ వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో చెన్నూరు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ లీడర్లు విచ్చలవిడిగా ఇసుక దందాకు పాల్పడి, రూ.కోట్లు సంపాదించుకున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు ఇసుక రాయల్టీ, పన్నులు చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంతో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు చెన్నూరులో ఇసుక దందాను బంద్ చేయించినట్టు చెప్పారు. తనపై చాలా మంది ఒత్తిడి తెచ్చినా ఇసుక మాఫియా పట్ల కఠినంగానే ఉన్నానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాపై సీరియస్‌గా ఉందని, తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపినట్టు తెలిపారు.
ఇసుక ఆదాయం పెంచాలనే మైనింగ్ పోర్టుపోలియో..
ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు జీపీఎస్ ఆధారిత వాహనాల పర్యవేక్షణ, డ్రోన్ నిఘా, శాటిలైట్ మ్యాపింగ్ వంటి అధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇసుక వాహనాల్లో ఓవర్ లోడింగ్‌ను కట్టిడి చేస్తున్నట్టు తెలిపారు. పన్ను ఎగవేసేందుకు కొందరు లారీలకు బదులు ట్రాక్టర్లు వినియోగిస్తున్నారని, దీనిని ఎట్టి పరిస్థితుల్లో అనుతించబోమని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక ద్వారా ఆదాయం పెంచాలనే సీఎం తనకు మైనింగ్ పోర్టుపోలియో ఇచ్చారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గత ఆరు నెలల్లో రాయల్టీ కింద 22 శాతం అధికంగా వసూలు చేశామని చెప్పారు. ఇసుక దందాను అడ్డుకోవడంతోనే తనపై బీఆర్‌ఎస్ లీడర్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తప్పుడు పోస్టులు పెడితే ఊరుకునేది లేదని, పోలీస్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇసుకను బుక్ చేసుకున్నవారికి శాండ్ బజార్ల నుంచి తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇసుక, మట్టి దందాపై పర్యవేక్షణ లోపించిందని, ఇలాంటివి సహించబోనని జిల్లా మైనింగ్ ఏడీ జగన్మోహన్ రెడ్డిని మంత్రి మందలించారు.
కేసీఆర్ ఫ్యామిలీలో ఆస్తుల కోసం గొడవలు..
బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ ఫ్యామిలీ రూ.వేల కోట్లు దోచుకుందని, ఆ ఆస్తులను పంచుకోవడం కోసమే ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ బిడ్డ కవిత కూడా చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు మింగారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తుందని, రెండేండ్లలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యవసాయం జరిగిందని చెప్పారు. మంచిర్యాల జిల్లాకు రూ.2.40 కోట్ల సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు వచ్చాయన్నారు. ఇందులో చెన్నూరు నియోజకవర్గ రైతులకు రూ.80 లక్షల విలువైన పరికరాలు అందించనున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కల్పన, ఏడీ ప్రసాద్, మైనింగ్ ఏడీ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, చెన్నూరు వ్యసాయ కమిటీ చైర్మన్ మహేశ్ తివారీ తదితరులు పాల్గొన్నారు.
