- రాష్ట్రంలో అత్యంత పేదలకు సాయం చేసేందుకు సర్కార్ కృషి: మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించి, వారికి సహాయం అందించాలని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం సెక్రటేరియెట్‌లో పీఆర్, ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, డైరెక్టర్ శృతి ఓజా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్‌తో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
అత్యంత పేద వర్గాల గుర్తింపు, వారి అవసరాల అంచనా, విడతల వారీగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. సీతక్క మాట్లాడుతూ.. గణాంకాల ఆధారంగా కాకుండా గ్రామీణ స్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా పేదలను గుర్తించాలని సూచించారు.
ఇందుకోసం ప్రమాణాలు రూపొందించి ప్రతి కుటుంబ జీవన స్థితి, ఆదాయ వనరులు, నివాస పరిస్థితులు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు. అత్యంత పేదలను గుర్తించే ప్రక్రియలో మహిళా స్వయం సహాయక బృందాలు (ఎస్‌హెచ్‌జీ) పాత్ర కీలకమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో స్థానిక పరిస్థితులను తెలిసిన బృందాల ద్వారా ఇంటింటి సర్వేలు నిర్వహించాలని పేర్కొన్నారు.
