- ప్యాసింజర్లు పెరగడంతో పక్క జిల్లాకు ఆర్టీసీ సిటీ బస్సులు
- దోచుకుంటున్న ప్రైవేట్ బస్సులు
- కార్లలో వెళ్తుండడంతో హైవేపై ట్రాఫిక్ జామ్స్
హైదరాబాద్‌సిటీ, వెలుగు : సంక్రాంతికి మూడు రోజుల ముందు నుంచే నగర జనం ఊరి బాట పట్టగా..ఈ రద్దీ సోమవారం మరింత పెరిగింది. దీంతో నగరంలోని రైల్వే , బస్ స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి, హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్లతో పాటు జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్, ఆరామ్‌ఘర్ తదితర బస్స్టేషన్లలో ఇసుక వేస్తే రాలనంత ప్రయాణికులు కనిపిస్తున్నారు. దీంతో రైల్వే, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు దొరకడం లేదు. దీంతో చాలామంది ప్రైవేట్బస్సులు, కార్లవైపు మళ్లుతున్నారు.
ఈ క్రమంలో రైల్వే జనరల్ప్యాసింజర్లను దృష్టిలో పెట్టుకుని అన్రిజర్వుడ్రైళ్లను అందుబాటులోకి తీసుకురాగా, ఆర్టీసీ స్పెషల్బస్సులను మరిన్ని రంగంలోకి దింపింది. సాధారణంగా సంక్రాంతికి ఏపీకి వెళ్లే వారే ఎక్కువగా ఉంటారని, ఈసారి తెలంగాణ జిల్లాలకు కూడా ఫ్లో పెరిగిందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే 50శాతానికి పైగా జనం సొంతూళ్లకు వెళ్లారని అంటున్నారు.
స్పెషల్ రైళ్లు, బస్సులు..
సంక్రాంతి కోసం మొదట్లో 50 స్పెషల్రైళ్లను నడిపిన రైల్వే ఇప్పుడు రద్దీ పెరగడంతో మరో 112 స్పెషల్రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే, రిజర్వేషన్చేయించుకోకుండా జనరల్రైళ్లలో వెళ్లే వారి 194 అన్రిజర్వ్స్పెషల్ట్రైన్లను నడుపుతోంది. ఇతర స్పెషల్ ట్రైన్లు మరో 400 కలిపి 804 రైళ్లను నడిపిస్తోంది. స్పెషల్ రైళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే వారికే ఎక్కువగా కేటాయించామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
అలాగే, ఇదే సీజన్లో శబరి మలై వెళ్లే వారి కోసం 48 రైళ్లను నడిపిస్తోంది. ఆంధ్రా వైపు వెళ్లేందుకు ఎంజీబీఎస్నుంచి 1,100 స్పెషల్ బస్సులు, తెలంగాణ జిల్లాలకు వెళ్లే వారి కోసం జేబీఎస్నుంచి వెయ్యి స్పెషల్బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. మెదక్, గజ్వేల్, కరీంనగర్‌లాంటి పక్క జిల్లాలకు వెళ్లే వారి కోసం కొన్ని సిటీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ
ఇన్ని రైళ్లు, ఆర్టీసీ బస్సులు నడుపుతున్నా అందులో సీట్లు, టికెట్లు దొరకని వారు ప్రైవేట్బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారి అవసరాలను ప్రైవేట్ట్రావెల్స్నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో కంటే టికెట్ఛార్జీలను రెండు నుంచి మూడు రెట్లు అధికంగా పెంచి దండుకుంటున్నారు. దీన్ని నివారించడానికి చాలా చోట్ల ఆర్టీఏ తనిఖీలు చేస్తున్నా తీరు మారడం లేదు.
కార్లలో ప్రయాణం, హైవేలో ట్రాఫిక్ జామ్
రైళ్లు, బస్సులు, ప్రైవేట్ట్రావెల్స్లో వెళ్లి ఇబ్బందులు పడడం ఎందుకని చాలామంది సొంత, రెంట్కార్లు మాట్లాడుకుని ఊళ్లకు వెళ్తున్నారు. దీంతో విజయవాడ జాతీయ రహదారిపై పెద్దయెత్తున ట్రాఫిక్ జామ్ఏర్పడుతోంది. అలాగే, బెంగళూరు, ముంబై హైవే, రాజీవ్నేషనల్హైవేలపై వాహనాల రద్దీ పెరిగింది.
219 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు
ప్రయాణికులను దోచుకుంటున్న ప్రైవేట్ట్రావెల్స్పై ఆర్టీఏ అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేయకుండా, ఫిట్నెస్ లేని బస్సులను నడపకుండా , ప్యాసింజర్బస్సుల్లో గూడ్స్రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీని కోసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 8 తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి సోమవారం వరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 219 పైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు.
