కామారెడ్డి మున్సిపల్ ముట్టడి..బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట

కామారెడ్డి మున్సిపల్ ముట్టడి..బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట
  • ఓటరు లిస్టులో అవకతవకలపై ఆందోళన
  • అరగంట పాటు ఉద్రిక్తత

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మున్సిపల్ ఆఫీస్​ను సోమవారం బీజేపీ శ్రేణులు ముట్టడించాయి. మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ఇటీవల ప్రకటించిన ఓటరు లిస్టులో అవకతవకలు జరిగాయని,  బోగస్​ ఓటర్లను చేర్పించారని వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మున్సిపల్ ఆఫీస్​లో అరగంటకు పైగా ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ శ్రేణులు ఆఫీస్​లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. మెయిన్ డోర్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అర గంటకు పైగా తోపులాట జరిగింది.

 పోలీసులు బలవంతంగా లాక్కెళ్లుతున్నా తప్పించుకొని వచ్చి మళ్లీ నిరసనకు దిగారు. ప్రభుత్వానికి,  అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బోగస్​ ఓటర్లను తొలగించాలని,   వార్డుల వారీగా ఓటర్ల విభజన సరి చేయాలని కోరారు. బీజేపీ శ్రేణులను లింగంపేట, తాడ్వాయి పోలీస్ స్టేషన్లకు తరలించారు.  బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ నరేందర్​రెడ్డి, టౌన్​ ప్రెసిడెంట్ మోటూరి శ్రీకాంత్, నాయకులు ఆకుల భరత్, నరేందర్,  నంది వేణు, అనిత, బాలమణి తదితరులు పాల్గొన్నారు.