స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలి: మంత్రి వివేక్

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తగిన గుణపాఠం చెప్పాలి: మంత్రి వివేక్

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కు  తగిన గుణపాఠం చెప్పాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేంనూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి నాల్గవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో   మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వివేక్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే ఇప్పటివరకు పార్లమెంట్లో బిల్లు పెట్టడం లేదన్నారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను అనేక విధాలుగా మోసం చేశారని ఆరోపించారు వివేక్.  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ సన్న బియ్యాన్ని అందిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 

గత  ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజా పాలన సాగిస్తుందన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందన్నారు.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ సోషల్ మీడియాను వాడుకొని తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. 500 కోట్ల అవినీతి డబ్బులను తమ ఖజానాలో దాచుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిపైన ఎంక్వయిరీ చేయాలని  కవిత కోరారని చెప్పారు.

►ALSO READ | రైతులకు గుడ్ న్యూస్..రేపటి( నవంబర్ 19) నుంచి పత్తి కొనుగోళ్లు షురూ..

 వేంనూర్ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి వివేక్ .  తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నందుకు రామగుండం నియోజకవర్గం ప్రజలకు  ధన్యవాదాలు తెలిపారు. రామగుండం ప్రాంతంలో ఎల్లంపల్లి ముంపు గ్రామాల్లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక బోర్ వెల్స్, స్కూల్స్ లో బెంచీలు పంపిణీ చేశామన్నారు.  కాక, తాను చేసిన కృషి చేసిన ఫలితంగా RFCL  రీ ఓపెన్ అయ్యిందన్నారు.. దీంతో ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికాయని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలని కేంద్ర మంత్రులను కోరానని చెప్పారు.  రాబోయే పుష్కరాల్లో ఈ ఆలయానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు మంత్రి వివేక్.