రైతుల పేరుతో ధర్నాలు చేస్తున్నది బీఆర్ఎస్ వాళ్లే.. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి బాల్క సుమన్ కుట్ర : మంత్రి వివేక్ వెంకటస్వామి

రైతుల పేరుతో ధర్నాలు చేస్తున్నది బీఆర్ఎస్  వాళ్లే..  ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి బాల్క సుమన్  కుట్ర : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవ్ 
  • మంత్రి వివేక్ వెంకటస్వామి హెచ్చరిక 
  • తెలంగాణ ప్రజలకు బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ 
  • బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణి నాశనమైందని ఫైర్

కోల్ బెల్ట్/జైపూర్, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోలు సజావుగా జరుగుతుంటే బీఆర్ఎస్ నాయకులు కావాలనే ధర్నాలు చేస్తున్నారని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో బీఆర్ఎస్ లీడర్ బాల్క సుమన్ చట్టాన్ని చేతిలోకి తీసుకునేలా కుట్రలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. 

బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి, జైపూర్ మండలాల్లో మంత్రి వివేక్ పర్యటించారు. జైపూర్ మండలం టేకుమట్లలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వనజా రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వడ్లు కొనాలని అధికారులను ఆదేశించారు. 

ఆ తర్వాత మందమర్రి మండలం అందుగులపేటలో టెన్త్​లో ప్రతిభ చూపిన ప్రభుత్వ బడుల విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ యాదయ్య, ఏసీపీ కిరణ్ కుమార్, డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హమాలీల కొరత, లారీలు దొరక్కపోవడంతో వడ్ల కొనుగోలులో కొంత ఆలస్యం జరిగిందన్నారు. పెద్దపల్లి జిల్లాలో మూడు గోదాములు అలాట్ చేశామని, సింగరేణి సంస్థను లారీలను కేటాయించాలని కోరామని చెప్పారు. జూన్ 6 వరకు ధాన్యం కొనుగోలు కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. చివరి గింజ వరకు వడ్లు కొంటామని హామీ ఇచ్చారు. 

  • అవినీతి సొమ్ముతో ధర్నాలు చేయిస్తున్నరు.. 

బీఆర్ఎస్ శ్రేణులను రెచ్చగొట్టేందుకు బాల్క సుమన్ కుట్రలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని రెచ్చగొట్టేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. బాల్క సుమన్ పై చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సింగరేణిని నాశనం చేసిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చి బీఆర్ఎస్ తప్పినందుకు సింగరేణి భవన్, మందమర్రి జీఎం ఆఫీసును కాల్చి వేయాలా? అని మంత్రి ప్రశ్నించారు. బాల్క సుమన్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ధర్నాలలో రైతులు పాల్గొనడం లేదని ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో వడ్లు దించుకోక వందలాది లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయేవని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. రైతులు రాకపోవడంతో అవినీతి సొమ్ముతో ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు. వంద కేసులు ఉన్నాయని చెప్పుకునే బాల్క సుమన్ మొన్నటి ఎన్నికల్లో రూ.వంద కోట్లు ఎలా ఖర్చు పెట్టాడని ప్రశ్నించారు. ఇసుక, భూ మాఫియా, అవినీతి అక్రమాల ద్వారా వందల కోట్లు దండుకున్నాడని మండిపడ్డారు.

  • ప్రభుత్వ బడుల్లో చదివినోళ్లే టాపర్స్.. 

ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవాళ్లే ఎక్కువగా టాపర్స్ గా నిలుస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 50 వేల టీచర్లను భర్తీ చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని, చెన్నూరు నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి స్పెషల్ ఫండ్స్ కేటాయించామని చెప్పారు. విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా చోట్ల బాలికలకు టాయిలెట్స్ కట్టించామన్నారు. టీచర్ల భర్తీ, బెంచీలు, బోర్ వెల్స్ కూడా వేశామని చెప్పారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు అని, అది స్వేచ్ఛను, ఆలోచనా శక్తిని ఇస్తుందన్నది అంబేద్కర్ ఆలోచన అని తెలిపారు. చెన్నూరులో ఏటీసీ సెంటర్ నిర్మిస్తున్నామని, అందులో చదివే స్టూడెంట్లకు నెలకు రూ. 2 వేల స్కాలర్ షిప్ ఇస్తామన్నారు. 

  • సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ 

చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో బుధవారం రాత్రి రైతులకు 250 క్వింటాళ్ల సబ్సిడీ జీలుగ విత్తనాల బ్యాగ్స్ ను మంత్రి వివేక్ పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రూ. 4,905 విలువైన జీలుగ విత్తనాల బ్యాగును ప్రభుత్వం సగం ధరకే అందిస్తోందన్నారు. గతంతో పోలిస్తే ఈసారి15 రోజుల ముందే పంట చేతికి వచ్చిందని, దిగుబడి కూడా ఎక్కువ వచ్చిందని చెప్పారు. హమాలీలు, లారీల కొరతతో కొనుగోలు కొంత ఆలస్యమైందన్నారు. లారీల కొరత లేకుండా మంచిర్యాల, భూపాలపల్లి టీజీఎండీసీ ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడామన్నారు.

 మంచిర్యాల,పెద్దపల్లి జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడానని, ధాన్యాన్ని వేగంగా గోదాములకు తరలించేలా చూస్తున్నామని తెలిపారు. రెండు కళ్ళను, పార్థివదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు దానం చేసిన చెర్లపల్లి భారతి ఎందరికో ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు. భారతి అనారోగ్యంతో ఈ నెల 21న  మృతి చెందగా, బాధిత కుటుంబసభ్యులను మంత్రి బుధవారం పరామర్శించారు.