
- పాశమైలారం ఘటన జరిగిన మరుసటిరోజే ప్రమాదస్థలికి సీఎం రేవంత్
- అయినా ముఖ్యమంత్రి వెళ్లలేదంటూ కేటీఆర్ తప్పుడు ట్వీట్
- కొండగట్టు బస్సు ప్రమాదం జరిగితే నాటి సీఎం కేసీఆర్ కన్నెత్తి చూడలేదని ఫైర్
- గాంధీ భవన్‌లో మంత్రులతో ముఖాముఖికి హాజరు.. వివిధ సమస్యలపై పెద్ద సంఖ్యలో మంత్రికి వినతి పత్రాలు
- అప్పటికప్పుడు కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి కొన్ని సమస్యలకు పరిష్కారం
హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కారుహయాంలో పదేండ్లలో ఏనాడూ మంత్రులను కలిసే అవకాశం ప్రజలకు దక్కలేదని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో ప్రజల వద్దకే మంత్రులు వస్తున్నారని తెలిపారు. బుధవారం (జులై 09) గాంధీ భవన్‌లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలను స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశంలో వివేక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే ప్రజా పాలన అని అన్నారు. గాంధీభవన్‌లో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే మంత్రులు వస్తున్నారని చెప్పారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో పోలీసు రాజ్యం నడిచిందని, సమస్యలను చెప్పుకునేందుకు పోతే అరెస్టు చేసేవారని, అడుగడుగునా నిర్బంధాలు ఉండేవని అన్నారు. ఇందుకు చెన్నూరు నియోజకవర్గం చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఏ ఒక్కరిపై తప్పుడు కేసులు పెట్టలేదని, ప్రతిపక్షాలపై వేధింపులు లేవని చెప్పారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తిరిగి దాన్ని కొనసాగిస్తున్నదని వెల్లడించారు. పాశమైలారం సిగాచీ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి కార్మికులు చనిపోతే.. మరుసటిరోజే సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లారని చెప్పారు. అక్కడే బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి వెంటనే నష్టపరిహారం కూడా ప్రకటించారని గుర్తు చేశారు.
కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం సీఎం రేవంత్ సంఘటనా స్థలానికి వెళ్లలేదని తప్పుడు ట్వీట్ పెట్టారని మండిపడ్డారు. అదే కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగి 60 మందికి పైగా ప్రయాణికులు మరణిస్తే.. అప్పటి సీఎం కేసీఆర్ కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదని, ప్రతిపక్ష నేతగా పాశమైలారానికి కూడా వెళ్లలేదని మండిపడ్డారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. సొంత ఇంట్లో అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత మధ్యే పంచాయితీ ఉందని, అలాంటప్పుడు రాజకీయ పార్టీలో విభేదాలు సహజమని పేర్కొన్నారు. డీసీసీ పదవులు హైకమాండ్ నిర్ణయమేనని చెప్పారు. కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనపై విచారణ నడుస్తున్నదని, బాధ్యులపై చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు.
పార్టీని నమ్ముకున్నోళ్లకు ప్రాధాన్యం..
పార్టీని నమ్ముకొని ఉన్నోళ్లకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కూడా పీసీసీకి ఇదే చెప్పారని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె గుర్తుచేశారని, అందుకు అనుగుణంగానే పదవుల భర్తీ ఉంటుందని చెప్పారు.
కాంగ్రెస్‌లో అందరినీ కలుపుకొని పోతామని తెలిపారు. గురువారం జరగనున్న రాష్ట్ర కేబినెట్ మీటింగ్‌లో గత మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలపై రివ్యూ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. గిగ్ వర్కర్ల చట్టం గురించి కసరత్తు జరుగుతున్నదని, వారి హక్కుల కోసం ప్రభుత్వం తప్పకుండా చర్యలు చేపడుతుందని తెలిపారు.
సిగాచి ఫ్యాక్టరీ ఘటనపై విచారణ నడుస్తున్నదని, కంపెనీ యాజమాన్యం నిబంధనలు పాటించి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. కంపెనీ యాజమాన్యాలతో ఈ నెల 25 న సమావేశం ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏం చేయాలో అందులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బీఆర్ఎస్ తీసుకున్న ఇండ్లను తిరిగి ఇప్పిస్తా
బీఆర్ఎస్ నేతలు స్వాధీనం చేసుకున్న ఇందిరమ్మ ఇండ్లను, పట్టాలను తిరిగి ఇప్పిస్తానని తన వద్దకు వచ్చిన బాధితులకు మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్‌ను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో అందజేశారు. అప్పటికప్పుడు సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి.. కొన్ని సమస్యలను పరిష్కరించారు.
మరికొన్ని వినతిపత్రాలను సంబంధిత అధికారులకు పంపించి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను బీఆర్ఎస్ సర్కారు స్వాధీనం చేసుకున్నదని చేవెళ్ల నియోజకవర్గంలోని నవాబ్‌పేట మండలం అర్కతల గ్రామస్తులు.. మంత్రి వివేక్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే వికారాబాద్ జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి, వారికి తగిన న్యాయం చేయాలని వివేక్ ఆదేశించారు.
బాధితులు కలెక్టరేట్ వద్దకు వస్తే తాను సమస్యను పరిష్కరిస్తానని మంత్రికి కలెక్టర్ వివరించారు. సిటీ శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని, ఆ భూమిని టీజీఐఐసీకి అప్పగించిందని పలువురు బాధితులు దృష్టికి తీసుకురాగా.. వారికి న్యాయం చేయాలని అధికారులను మంత్రి వివేక్ ఆదేశించారు.