రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో
బాల కార్మికులకు విముక్తి
చైల్డ్ లేబర్ ప్లాట్‌ఫామ్ 16వ వార్షిక సమావేశంలో మంత్రి
హైదరాబాద్, వెలుగు: బాల కార్మిక వ్యవస్థకు మూల కారణాలు పేదరికం, వలసలు, సామాజిక భద్రత లేమి అని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ అన్నారు. కుటుంబాల్లో మంచి ఉపాధి, సామాజిక భద్రత లభించినప్పుడే, పిల్లలు పనిచేయకుండా పాఠశాలలకే పరిమితమవుతారని పేర్కొన్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పటిష్టమైన చర్యలు చేపట్టిందని, అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డులను విస్తరించిందని తెలిపారు. ముఖ్యంగా, బలహీన వర్గాల కుటుంబాలకు ఆసరా పెన్షన్, కల్యాణ లక్ష్మి, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడం ద్వారా ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆధ్వర్యంలో బాల కార్మికుల నిర్మూలనకు కృషి చేస్తున్న చైల్డ్ లేబర్ ప్లాట్‌ఫామ్ (సీఎల్‌పీ) 16వ వార్షిక సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ మాట్లాడుతూ.. సీఎల్‌పీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. వినూత్న నమూనాలను ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి, ఇతర రాష్ట్రాలతో తమ అనుభవాలను పంచుకోవడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని చెప్పారు.
నిషేధం కన్నా.. నివారణే ముఖ్యం..
రాష్ట్రంలో బాల కార్మిక నివారణకు శాంతా సిన్హా, గీతా రామస్వామి వంటి కార్యకర్తలు ప్రభుత్వంతో కలిసి ఎంతో కృషి చేసి విజయం సాధించారని మంత్రి వివేక్ వెంకటస్వామి గుర్తుచేశారు. బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం కన్నా నివారించడమే అత్యంత కీలకమని, ఈ విధానాన్నే రాష్ట్ర ప్రభుత్వం బలపరుస్తోందని చెప్పారు.
విదేశీ ఎగుమతిదారులు సహా అనేక మంది పారిశ్రామిక వేత్తలు తమ పరిశ్రమల్లో బాల కార్మికులను నిషేధిస్తే సమస్య నిర్మూలనకు దోహదపడుతుందని వివరించారు. ఎక్కువగా వ్యవసాయ రంగంలోనే బాల కార్మికులు ఉన్నందున, ఆ రంగాన్ని కూడా పరిష్కరించాల్సి ఉందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం వంటి చర్యలను అమలు చేస్తున్నామని చెప్పారు.
విద్య అనేది పిల్లల హక్కు అని మంత్రి స్పష్టం చేశారు. ప్రగతి, ఉత్పాదకత, రక్షణకు తెలంగాణ రాష్ట్రం ఒక మంచి ఉదాహరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ లేబర్ సెక్రటరీ (ఐఎల్‌ఓ), చైల్డ్ లేబర్ ప్లాట్‌ఫామ్ (సీఎల్‌పీ) సెక్రటరీ, ఇతర భాగస్వాములకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
