
- దళితులు ఆర్థికంగా ఎదిగితేనే వివక్ష పోతుంది
- ప్రజలకు సేవ చేసే గుణం మా నాన్న నేర్పిండు
- మంత్రి వివేక్ వెంకటస్వామి
ఆదిలాబాద్, వెలుగు: దేశంలో ఎన్నో కులాలు.. ఎన్నో మతాలు ఉన్నప్పటికీ దేశం ఏకతాటిపై ఉండడం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే సాధ్యమైందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కుమ్రం భీం, చాకలి ఐలమ్మ విగ్రహాలకు నివాళులు అర్పించారు. దళితులు ఆర్థికంగా ఎదిగినప్పుడే వారిపట్ల వివక్షపోతుందని మంత్రి అన్నారు. తాను సింపుల్గా ఉంటానని అందరూ అంటుంటారని, అది తన తండ్రి నేర్పించిన సంస్కారం వల్ల వచ్చిందన్నారు.
ఒక పని కోసం సంగారెడ్డి కలెక్టరేట్ కువెళ్లినప్పుడు స్టూలు మీద కూర్చుని ఏడుగంటల పాటు వెయిట్చేశానని గుర్తుచేసుకున్నారు. ధర్మారం మండలంలో స్కూల్లో కరెంట్ షాక్ తో నలుగురు పిల్లలు చనిపోయినప్పుడు గవర్నమెంట్ స్కూళ్లకు ఏదైనా చేయాలని అనిపించిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 వేల స్కూళ్లకు ఫర్నీచర్ అందించినట్లు చెప్పారు. రూ.10 లక్షలు ఖర్చు చేసి అంబేద్కర్విగ్రహం ఏర్పాటు చేసినందుకు వసంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిని అభినందించారు.
అంబేద్కర్ పేదల కోసమే ఆలోచించేవాడు..
అంబేద్కర్ ఎప్పుడూ పేదల కోసమే ఆలోచించారని, అందుకే ఒక కులానికి, మతానికి, వర్గానికే పరిమితం కాకుండా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా రాజ్యాంగం రూపొందించారన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పడిందన్నారు. మంచిర్యాలలో అంబేద్కర్ భవనం కోసం రూ. 50 లక్షలు ఎంపీ నిధులు ఇచ్చారని, ఇక్కడ కూడా ఎంపీ నిధులు మంజూరు అయ్యేలా చూడాలన్నారు. అన్ని చోట్ల అంబేద్కర్ భవనాలు నిర్మించాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
ఉమ్మడి జిల్లాలో సమస్యలు పరిష్కరిస్తామని, అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తే ఇన్చార్జి మంత్రితో కలిసి మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఎంపీ, ఎమ్మెల్యేలు, మాల సంఘం నేతలు సత్కరించారు. ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాస్ రెడ్డి, ఆడె గజేందర్, మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.
బోనమెత్తిన మంత్రి వివేక్..
మంత్రి వివేక్ తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో బోనాల పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమ్మవారి బోనం ఎత్తుకున్నారు. ఉదయం నార్నూర్ లో అంబేద్కర్, బుద్ధుని విగ్రహాలకు పూలమాలలు వేశారు. గౌతమ్, ఆర్తీల వివాహానికి హాజరై వారిని ఆశీర్వదించారు. ఆయన వెంట ఎమ్మెల్యే బొజ్జు పటేల్, కాంగ్రెస్ లీడర్లు ఆత్రం సుగుణ, శ్యాం నాయక్, దేవరాజ్ తదితరులు ఉన్నారు.