సీతారాముల కంటే ఆదర్శ దంపతులు ఈ విశ్వంలో లేరని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ పర్యటించారు. 7 వ వార్డు, కొత్త తిమ్మాపూర్, పాత తిమ్మాపూర్ అమ్మ గార్డెన్ తో పాటు కేతనపల్లి మనబడి మున్సిపాలిటీల్లో పలు హనుమాన్ ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి, సరోజా దంపతులు. వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు వివేక్ దంతపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్.. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రాముడు చూపిన బాటలో నడవాలని..ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని చెప్పారు . కుటుంబ సభ్యులను ఎలా ప్రేమించాలో రాముడు చూపించాడని అన్నారు. శ్రీరామరాజ్యం స్థాపించి రాముడు ఒక రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చూపించాడని తెలిపారు. కష్ట సమయాల్లో జీవితాన్ని ఎలా గడపాలో రాముడు చూపించాడని చెప్పారు. ఒక ఆదర్శవంత మైన జీవితాన్ని గడిపి,మానవ జన్మకున్న విశిష్ఠతను ఆవిష్కరించిన ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి అని అన్నారు.
