- మీ కార్యక్రమాలకు జనం రావట్లేదని కార్యకర్తలను
- రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టిస్తరా?
- హీరోయిజం చూపించుకునేందుకు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి కుట్ర
- గతంలో మా వెహికల్స్‌పై రాళ్ల దాడి చేయించిండని ఫైర్
కోల్‌బెల్ట్/ చెన్నూరు, వెలుగు: సింగరేణి ఆఫీసులు కాలబెట్టాలని, రైలు పట్టాలు కోసేయాలని బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ హింసను ప్రేరేపించేలా మాట్లాడడం సమాజానికి ప్రమాదకరమని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కార్యకర్తలను రెచ్చగొట్టి హింసకు పురిగొల్పుతున్నాడని విమర్శించారు. బాల్క చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ నేత హరీశ్‌రావు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. అతని మాటలను సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరు, జైపూర్ మండలాల్లో మంత్రి పర్యటించారు. చెన్నూరు మండలం బావురావుపేట ఐకేపీ సెంటర్‌ను కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ ప్రెసిడెంట్రఘునాథ్రెడ్డితో కలిసి సందర్శించి రైతులతో మాట్లాడారు. జైపూర్ మండలం టేకుమట్లకు కొత్తగా బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రిని సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరుగుతుంటే అబద్ధాలతో బీఆర్ఎస్ నాయకులు రైతులను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఎన్నికల్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌తో బాల్క సుమన్‌ను విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నాడన్నారు. ఆ పార్టీ ధర్నాలకు రైతులు రావ డంలేదని స్వయంగా సుమనే చెప్పాడన్నారు. హీరోయిజాన్ని చూపించుకునేందుకు మంత్రి, ఎంపీల మీద కార్యకర్తలతో రాళ్ల దాడి చేయించిన సుమన్ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. వందల కోట్లతో నిర్మించిన రైలు పట్టాలను కోసేస్తే సామాన్యులు నష్టపోతారన్నారు. సింగరేణి ఆఫీసును కాల్చాలన్న సుమన్ ఈ ప్రాంత ప్రజలు, కార్మికులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
- 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తం
చివరి గింజ వరకు కొంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఏటా ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చేదని, ఈ సీజన్లో 28 నుంచి 32 క్వింటాళ్లకు పెరిగిందని, దీనివల్ల పెద్ద ఎత్తున ధాన్యం సెంటర్లకు వస్తోందన్నారు. చెన్నూర్, కోటపల్లి ప్రాంతాలలో కోతలు ఆలస్యమయ్యాయని, ఇక్కడ జూన్ 15వ తేదీ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు.
మంచిర్యాల జిల్లాలో 2022–23లో బీఆర్ఎస్ హయాంలో 1.13 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొనగా.. ఈసారి ఇప్పటికే 1.27 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, జూన్ 6 వరకు మరో 30 వేల నుంచి 40 వేల టన్నులు కొంటామని, మొత్తం 1.60 లక్షల ధాన్యం సేకరిస్తామని చెప్పారు. స్థానిక హమాలీలను నియమించి లోడింగ్, అన్ లోడింగ్ వేగవంతం చేస్తున్నామన్నారు. సింగరేణి లారీలను ధాన్యం రవాణాకు మళ్లించనున్నట్టు చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేని 14 గ్రామాలకు బస్సుసర్వీసులు వేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించినట్టు చెప్పారు.
- ఇసుక, భూ మాఫియాతో దోచుకున్నడు
గత ఎన్నికల్లో సుమన్ రూ.100 కోట్లు ఖర్చు చేశాడని, ఆయనకు అన్ని డబ్బులు ఎక్కడివని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక, భూముల దందాలు, పెద్ద బిల్డింగ్‌ల నిర్మాణాల్లో కమీషన్లు దండుకున్నాడని ఆరోపించారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు ప్రయోజనం కలగలేదని, కమీషన్ల పేరుతో బీఆర్ఎస్ లీడర్లు దోచుకున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో రైతులు వేల ఎకరాల పంటలు కోల్పోయా రని, వారికి పరిహారం ఇవ్వలేదన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత పంటలకు, భూములకు పరిహారం ఇప్పించానన్నారు. సింగరేణిలో లక్ష ఉద్యోగాలు ఉంటే బీఆర్ఎస్ పాలనతో 38 వేలకు తగ్గాయని తెలిపారు.
