బీఆర్ఎస్‌‌‌‌కు దళితులంటే చిన్న చూపు.. కించపరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు: మంత్రి వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్‌‌‌‌కు దళితులంటే చిన్న చూపు.. కించపరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి తీరుపై ఫైర్​
  • ఖబడ్దార్ కౌశిక్​రెడ్డి: మందుల సామేలు
  • దళితులపై గుండాగిరీ చేస్తరా?: మంత్రి అడ్లూరి 
  • కౌశిక్‌‌‌‌రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్​ చేయాలి: మంత్రి అజారుద్దీన్

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్ఎస్​ పార్టీకి దళితులంటే చాలా చిన్నచూపు ఉన్నదని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చాక కేసీఆర్​ దళితుడిని సీఎం చేయలేదని.. కనీసం దళితుడికి వర్కింగ్​ ప్రెసిడెంట్​ పదవి కూడా ఇయ్యకుండా కేసీఆర్‌‌‌‌ తన కొడుకు కేటీఆర్‌‌కు కట్టబెట్టారని మండిపడ్డారు. దళితులను కించపరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అసెంబ్లీలో ఆదివారం సీనియర్​ శాసనసభ్యుడు కడియం శ్రీహరి పట్ల హుజూరాబాద్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌‌రెడ్డి ప్రవర్తించిన తీరుపై మంత్రులు వివేక్, అడ్లూరి లక్షణ్, అజారుద్దీన్‌‌ స్పందించారు.

దళిత వర్గానికి చెందిన సీనియర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్​ రెడ్డి ప్రవర్తించిన తీరును తాను పూర్తిగా ఖండిస్తున్నానని మంత్రి వివేక్​ అన్నారు. బీఆర్ఎస్​ పార్టీకి దళితులపై ప్రేమలేదని చెప్పారు.  హౌస్‌‌లో సీనియర్లు అయిన హరీశ్‌‌ రావు, కేటీఆర్.. తొలిసారి ఎమ్మెల్యే అయిన కౌశిక్​ రెడ్డిని ఇలా తప్పులు చేయకుండా అడ్డుకోవాల్సి ఉండేదన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతున్నప్పుడు ఏ పార్టీ అని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే రాజేశ్వర్​రెడ్డి ప్రశ్నించారని గుర్తు చేశారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్​ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్​లో చేర్చుకొని అందులో కొందరికి కేసీఆర్​ మంత్రి పదవులు ఇచ్చిన విషయాన్ని మార్చిపోయారా.. రాజేశ్వర్​రెడ్డి?’’ అని వివేక్ ప్రశ్నించారు.

బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలు భయపడుతున్నరు..
క్వారీలు, క్రషర్లు, ఇసుక మాఫియాపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడంతో బీఆర్‌‌‌‌ఎస్​ లీడర్లు, ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందని మంత్రి వివేక్‌‌ అన్నారు. ‘‘రాఘవ కన్​స్ట్రక్షన్‌‌పై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అలాగే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులపై విచారణ జరపడానికి ప్రభుత్వం సిద్దం కావడంతో కేటీఆర్​ తెగ సంబురపడుతున్నారు. 

బావ హరీశ్‌‌రావుపై ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించడం కేటీఆర్‌‌‌‌కు  సంతోషం కలిగిస్తున్నది. ఇప్పుడు కూడా హౌస్‌‌లో కేటీఆర్​ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారు”అని వ్యాఖ్యానించారు. ఎడ్యుకేటెడ్​ పర్సన్స్​ అయిన వీరిద్దరూ సీఐడీ ఎంక్వైరీకి, హౌస్‌‌ కమిటీకి తేడా తెల్వకుండా ప్రవర్తించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. కేటీఆర్​ సొంత చెల్లెలు కవిత కూడా బీఆర్ఎస్​ పార్టీపై హౌస్‌‌ కమిటీ వేయాలని డిమాండ్​ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

‘‘రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన 37 శాతం ఇసుక మాఫియాపై సీఐడీ ఎంక్వైరీ జరుగుతుండటంతో వారికి  భయం పట్టుకున్నది. అందుకే ఆ ఎంక్వైరీ ఆపడానికే హౌస్‌‌ కమిటీ కావాలని విషయాన్ని డైవర్ట్​ చేసేందుకు  ధర్నా చేస్తున్నారు. విచారణ జరిగితే ఎక్కడ అక్రమ మైనింగ్​ విషయాలు బయటికి వస్తాయోననే భయం వారిని వేధిస్తున్నది” అని వ్యాఖ్యానించారు. కౌశిక్‌‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వివేక్‌‌ డిమాండ్​ చేశారు.

కౌశిక్‌‌రెడ్డి హీరోలాగా ఫీలవుతున్నడు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌
అసెంబ్లీ సాక్షిగా దళితులపై గుండాగిరీ చేస్తరా? అని కౌశిక్​ రెడ్డిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​ ఫైర్​ అయ్యారు. అసెంబ్లీలో బడ్జెట్​ సెషన్​ స్టార్ట్​ అయినప్పటి నుంచి కౌశిక్‌‌రెడ్డి తనను తాను ఓ  హీరోలాగా ఊహించుకుంటూ వేలు చూపిస్తూ, చిటికెలు వేస్తూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పొంగులేటిని టార్గెట్​ చేసి బీఆర్‌‌‌‌ఎస్​ ఎమ్మెల్యేలు కావాలనే ఆదివారం సభను జరగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.

చప్పట్లు కొట్టుకుంటూ వెల్‌‌లోకి వచ్చి రభస చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, సంపత్‌‌ కుమార్ లక్ష్మణ రేఖ దాటి ముందుకు వచ్చినందుకు.. వెల్‌‌లోకి వెళ్లినందుకే ఎమ్మెల్యే పదవుల నుంచి బర్తరఫ్​ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు కౌశిక్​ రెడ్డి ఏకంగా సీనియర్​ ఎమ్మెల్యే పట్ల ప్రవర్తించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.   

కౌశిక్‌‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: మంత్రి అజారుద్దీన్​ 
సీనియర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని తుపాకీతో కాల్చేస్తాననే విధంగా తన హావభావాలతో కించపరిచిన పాడి కౌశిక్‌‌రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని మంత్రి అజారుద్దీన్​ కోరారు. తోటి ఎమ్మెల్యేలను గౌరవించాల్సిన బాధ్యత హౌస్‌‌లో ఉన్న ప్రతి ఎమ్మెల్యేపై ఉంటుందని చెప్పారు. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అసెంబ్లీలో కావాలని ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను కూడా దెబ్బతీయవద్దని కోరారు. 

భవిష్యత్తు తరాలకు గుర్తుండేలా కౌశిక్‌‌రెడ్డిపై చట్టపరమైన చర్యలను తీసుకోవాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. పాడి తీరుపై వీరితో పాటు విప్​ ఆది శ్రీనివాస్​, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, రేవూరి ప్రకాశ్‌‌రెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయనను పదవి నుంచి బర్తరఫ్​ చేయాలని డిమాండ్​ చేశారు.