టీఆర్ఎస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరు

టీఆర్ఎస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరు
  • మీట్ ది ప్రెస్​లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
  • సమయం వచ్చినప్పుడు బయటకు వస్తరు
  • దళితబంధు ఇంకా ఎందుకిస్తలేడని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్​పై పోటీ చేసేందుకు రెడీ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. టీఆర్ఎస్ లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా సంతృప్తిగా, ఆత్మాభిమానంతో లేరన్నారు. అందుకే మెజార్టీ టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్​లో ఉన్నారని, ఆ పార్టీలో ఉంటే భవిష్యత్తు లేదని వారికి కూడా అర్థమైందన్నారు. అయితే మరో రెండేండ్లు అధికారంలో ఉండే అవకాశం ఉన్నందున ఇప్పుడే వారు ఆపార్టీని వీడకపోవచ్చన్నారు. టీఆర్ఎస్​తో బీజేపీకి ఎలాంటి దోస్తానా లేదని, తెలంగాణలో అధికారం బీజేపీదేనని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ గురువారం హైదరాబాద్​లోని ఓ హోటల్​లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఈటల మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ మాటలు ప్రజలు నమ్మడం లేదన్నారు. సీఎంకు ముందుచూపు లేకపోవడం వల్లే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని విమర్శించారు. కేసీఆర్, ఈటల వంటి వారికి రైతు బంధు, రైతు బీమా అవసరమా అని ప్రశ్నించారు. కౌలు రైతులను, రైతు కూలీలను విస్మరించారని ధ్వజమెత్తారు. కేసీఆర్​కు దళితులపై ప్రేమ ఉంటే దళిత బంధు ఇప్పటి దాకా ఎందుకు ఇస్తలేడని ప్రశ్నించారు. ఏడున్నరేండ్లుగా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. మానుకోటలో ఉద్యమకారులపై రాళ్లు వేసి, వారి రక్తాన్ని కళ్లజూసినోడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ఆరోపించారు. పోలీసులు కేసీఆర్ ఇంటి మనుషులుగా పనిచేస్తున్నారని, హుజూరాబాద్​ఎన్నికలప్పుడు ఇది రుజువైందన్నారు. తెలంగాణలో చైతన్యాన్ని చంపితేనే.. మునిమనవడు వరకు అధికారం తమ కుటుంబానికే ఉంటుందని భావించే వ్యక్తి కేసీఆర్ అన్నారు. సీఎం ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సహజత్వం కొల్పోదన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన అంతమే తన లక్ష్యమన్నారు. బీజేపీలో గ్రూపులు ఉన్నాయనేది కేసీఆర్ టీం ప్రచారం మాత్రమేనని విమర్శించారు. రాష్ట్రంలో విలువైన భూముల సెటిల్​మెంట్లు అన్ని సీఎం కుటుంబం కేంద్రంగానే జరుగుతున్నాయని ఆరోపించారు.