హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించబోతుంది. 7 రౌండ్లు పూర్తియ్యే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ దాదాపు 20 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుపోతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెనకంజలో ఉన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో మంత్రులు సంబురాలల్లో మునిగిపోయారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, వాకిటి శ్రీహరి ఇతర ముఖ్య నేతల స్వీట్లు తినిపించుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
మరోవైపు.. గాంధీభవన్లో కూడా విజయోత్సవాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంబరాల్లో మునిగిపోయారు. డప్పులు వాయిస్తూ.. బాణా సంచా పేల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. రప్పా రప్పా, తగ్గేదేలే అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ డ్యాన్సులు చేశారు. బాణసంచా, బ్యాండ్ చప్పుళ్లతో గాంధీ భవన్ పరిసరాలు మార్మోగిపోతున్నాయి.
యూసఫ్ గూడలోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నివాసం, కార్యాలయంలోనూ విజయోత్సవాలు షూరు అయ్యాయి. కాంగ్రెస్ శ్రేణులు, నవీన్ యాదవ్ అనుచరులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. నవీన్ యాదవ్ ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో నవీన్ యాదవ్ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది.
