షరతుల సాగుపై రైతులను ఒప్పించే పనిలో మంత్రులు

షరతుల సాగుపై రైతులను ఒప్పించే పనిలో మంత్రులు

హైదరాబాద్, వెలుగు‘షరతుల సాగు’కు ఒప్పుకోవాలంటూ రైతులను మంత్రులు బతిమాలుకుంటున్నారు. ఇందుకోసం రాష్ర్టమంతటా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. సర్కారు చెప్పిన పంట వేయాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి.. రైతులను బుజ్జగించి తీర్మానాలు చేయిస్తున్నారు. కొన్నిచోట్లయితే ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

వాయిస్ మారింది...

‘షరతుల సాగు’ అమలు కోసం మంత్రుల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం చెప్పిన క్లస్టర్​వారీ రైతు వేదిక నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. రోజూ రైతుల వద్దకు వెళ్తున్న మంత్రులు.. ఎలాగైనా షరతుల సాగు విధానంపై రైతులను ఒప్పించాలని చూస్తున్నారు. ‘సారు, సర్కారు చెప్పిన పంటలను వేయండి’ అని కోరుతున్నారు. కొత్త సాగు విధానం అమలులో భాగంగా ప్రభుత్వం చెప్పిన పంట వేయకుంటే రైతుబంధు పథకం అమలు కాదని వారం క్రితం వరకు సీఎం కేసీఆర్, మంత్రులు చెప్పారు.పంటల కొనుగోలు బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోదని చెప్పారు. అయితే కొన్ని రోజులుగా ఈ విషయాలపై ప్రభుత్వ పెద్దల మాటలో తీవ్రత తగ్గింది. రైతుబంధుకు, కొత్త పంట విధానానికి సంబంధం లేదని చెబుతున్నారు. కేసీఆర్​ఉన్నన్నాళ్లు రైతుబంధు ఉంటుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని హామీ ఇస్తున్నారు.

చెప్పిన పంట కాదు.. డిమాండ్ ఉన్న పంట

వానాకాలం నుంచి కొత్త పంటల సాగు విధానం ఉండాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి, వరి, కంది ప్రధాన పంటలుగా వ్యవసాయం ఉండాలని రైతులకు సూచించింది. వానాకాలంలో మొక్కజొన్నను పూర్తిగా సాగు చేయవద్దని స్పష్టం చేసింది. అదనంగా పత్తి 11 లక్షల ఎకరాలు, కంది సాగును 5 లక్షల ఎకరాల్లో పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్తున్న మంత్రులు.. ప్రభుత్వం చెప్పిన పంటల అనే మాటలకు బదులుగా డిమాండ్​ఉన్న పంటలే పండించాలని అంటున్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతులకు లాభాలు వస్తాయని చెబుతున్నారు. కొన్ని పంటల ధరలను ఉదాహరణలతో చెబుతూ రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

గ్రామాల్లో తీర్మానాలు

గ్రామాల్లో జరుగుతున్న సమావేశాల్లో మంత్రులు కొత్త విధానాన్ని రైతులకు వివరిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన పంటలే సాగు చేస్తామని రైతులు అంగీకరించేలా గ్రామాల వారీగా తీర్మానాలు చేయిస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్​రావు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో 50 వరకు గ్రామాలు తీర్మానాలు చేశాయి. ‘‘రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, మార్కెట్ ధర, పంటల కొనుగోలు వంటి వాటి కోసం ప్రభుత్వం ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఆర్థికంగా కష్టంగా ఉన్నా పంట రుణ మాఫీ ప్రక్రియ చేపట్టింది. మార్కెట్​లో డిమాండ్ ఉండే పంటలను సాగు చేస్తే రైతులకు లాభాలు వస్తాయి. అంతేగానీ పంటల సాగుకు ప్రభుత్వ పథకాలకు సంబంధం లేదు’ అని అందరు మంత్రులు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలకు, రైతుబంధుకు ప్రభుత్వం లంకె పెట్టిందని ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేస్తున్నాయని వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుత వానాకాలం వరకే ఈ విధానం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

ప్రశ్నిస్తున్న రైతులు

అవగాహన కార్యక్రమాల్లో వ్యవసాయ సైంటిస్టులతో లేదా అగ్రికల్చర్ ఆఫీసర్లతో టెక్నికల్ అంశాల గురించి మాట్లాడించాలి. కానీ సమావేశాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, సైంటిస్టులు ఉండట్లేదు. ఉన్నా వారికి లీడర్లు మాట్లాడే చాన్స్ ఇవ్వట్లేదు. మక్క పంటకు బదులు సర్కారు చెబుతున్న పత్తి సాగుకు నల్లరేగడి భూములు అనువైనవని, ఎర్రనేలలు పనికిరావని రైతులు అంటున్నారు. పంట కాలం ఎక్కువని, చివరి తడులు ఇవ్వలేకపోతే నిండామునుగుతామని చెబుతున్నారు. సన్న వరి సాగుకు పెట్టుబడి ఎక్కువ, దిగుబడి తక్కువని, ముందుగా గిట్టుబాటు ధర ప్రకటిస్తే తప్ప సాగు చేయలేమని స్పష్టం చేస్తున్నారు. ఈ అనుమానాలను లీడర్లు తీర్చడం లేదు. దీంతో నిరసనలు వినిపిస్తున్నాయి. సోమవారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోకల్ టీఆర్ఎస్​లీడర్లు, ఆఫీసర్లు ఏకగ్రీవ తీర్మానానికి ప్రయత్నించగా రైతులు వ్యతిరేకించారు. మక్కనే సాగుచేస్తామని, పత్తి, సన్నవరి సాగుచేస్తే ఐదారు నెలలు నీటి తడులు ఎలా అని ప్రశ్నించారు. ఆఫీసర్లు జవాబు చెప్పలేక వెళ్లిపోయారు. కరీంనగర్​జిల్లా గంగాధర మండలం చర్లపల్లి(ఎన్​) గ్రామస్థులూ ఇలాంటి ప్రశ్నలే వేసి, కొత్త సాగును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు.

ఏ మంత్రి ఎక్కడెక్కడ

  • సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో అవగాహన సమావేశాల్లో మంత్రి హరీశ్​రావు పాల్గొన్నారు. గజ్వేల్​లో 167, సిద్దిపేటలో 50, దుబ్బాకలో 30, హుస్నాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 30 గ్రామాలు షరతుల సాగుకు అనుకూలంగా తీర్మానాలు చేశాయి. మెదక్ జిల్లాలో ఒక్క నిజాంపేట్ మండలం నస్కల్​లో మాత్రమే అనుకూల తీర్మానం చేశారు.
  • మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇంద్రకరణ్​రెడ్డి పాల్గొన్నారు. కానీ ఏ పంచాయతీ కూడా అనుకూలంగా తీర్మానం చేయలేదు.
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో కేటీఆర్ పర్యటించారు. వేములవాడ, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, బోయినిపల్లి, ముస్తాబాద్​లో అవగాహన సమావేశాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు.
  • మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో 5 చోట్ల అవగాహన సమావేశాల్లో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
  • పువ్వాడ అజయ్ 23న ఖమ్మం జిల్లాలో రెండు గ్రామాల్లో, మంగళవారం కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.
  • కామారెడ్డి జిల్లాలోఈ నెల 22న ప్రశాంత్​రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఆఫీసర్లతో సమీక్ష జరిపారు.
  • హన్మకొండలోని అంబేడ్కర్ భవన్​లో, మహబూబాబాద్​లో జరిగిన కార్యక్రమాల్లో ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతిరాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో లక్షల్లో కరోనా టెస్టులు..ఇక్కడ వేలల్లోనా?