అసమ్మతి నేతలపై మంత్రి సైలెన్స్

అసమ్మతి నేతలపై మంత్రి సైలెన్స్

నిర్మల్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అసమ్మతి నేతలను, అసంతృప్తి నాయకులను కలుపుకొని పోయి పార్టీ పటిష్టతకు, గెలుపునకు కృషి చేయాలని ఎమ్మెల్యేలందరికీ బీఆర్ఎస్​ హైకమాండ్​ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే వారితో స్వయంగా మాట్లాడి పార్టీకోసం పనిచేసేలా చూడాలని కేసీఆర్​ఆదేశించారు. అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అంతరంగం జిల్లాలో ఎవరికీ అంతుబట్టడం లేదు. తనపై విమర్శలు చేసిన పార్టీ సీనియర్ నేత శ్రీహరి రావు విషయంలో ఇప్పటివరకు మంత్రి నోరు విప్పక పోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే పార్టీ నేతలను కూడా స్పందించవద్దని కోరారు. 

మామడ, లక్ష్మణచందా మండలాల్లో గట్టి పట్టున్న శ్రీహరి నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపగలడని చెబుతుంటారు.  శ్రీహరి కేవలం మంత్రిని మాత్రమే టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. అధిష్టానంపై ఎలాంటి వ్యాఖ్యలను చేయడం లేదు. మంత్రి వైఖరిపై అసంతృప్తితో ఉన్న శ్రీహరి కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు  ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు చెందిన రాష్ట్రస్థాయి నేతలు శ్రీహరితో మంతనాలు  జరిపినట్లు సమాచారం. అలాగే అసంతృప్తి తో వున్న మరో  బీఆర్ఎస్ సీనియర్ నేత సత్యనారాయణ గౌడ్ విషయంలో కూడా మంత్రి స్పందించడం లేదు. కొద్దిరోజుల క్రితం  అసంతృప్తితో ఉన్న కొందరి నాయకులతో సంప్రదింపులు జరిపిన మంత్రి, శ్రీ హరి రావు, సత్యనారాయణ గౌడ్ ల విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రాజీ ఫార్ములాను  తేకపోవడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. 

శ్రీహరితో గ్యాప్​

 శ్రీహరి బీఆర్ఎస్ టికెట్ పై నిర్మల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి సీనియర్ నాయకునిగా గుర్తింపు పొందారు. ఉద్యమ కాలం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. శ్రీహరికి, మంత్రికి మధ్య కొంతకాలం నుంచి గ్యాప్ ఏర్పడింది. చాలా రోజుల నుంచి అధికారిక కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు శ్రీహరి దూరంగా ఉంటున్నారు. అయితే  పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తనకు ఎలాంటి పిలుపు రావడంలేదని శ్రీహరి చెబుతుండగా, సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కావడం లేదని మంత్రి వర్గీయులు పేర్కొంటున్నారు. అసంతృప్తుల  విషయంలో  మంత్రి ఆచితూచిగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీహరి తనను  ప్రత్యక్షంగా విమర్శించినప్పటికీ ఇప్పటివరకు మంత్రి నోరు మెదపలేదు.  కానీ ఆయనపై మాత్రం  అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు  సమాచారం.

కాంగ్రెస్ వైపు శ్రీహరి చూపు...?

 నిర్మల్ నియోజకవర్గంలో పట్టున్న శ్రీహరి బీఆర్ఎస్ అధిష్టానం అవలంబిస్తున్న వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం,  మంత్రి ఐకే రెడ్డి తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో  చాలా రోజులుగా నారాజ్​ గా ఉన్నారు. 2018 ఎన్నికల సమయంలో మంత్రి గెలుపునకు శ్రీహరి కృషి చేశాడని, ఆ సమయంలో అధిష్టానం ఆయనకు  ఎమ్మెల్సీ హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఇవ్వలేదని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. 

దీంతో శ్రీహరి తీవ్ర అసంతృప్తికి  లోనయ్యాడని అంటున్నారు. ఇదే సమయంలో  పార్టీపై గుర్రుగా ఉన్న శ్రీహరి రావును తమ పార్టీలోకి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు.ఇప్పటికే రాష్ట్రస్థాయి నేతలు ఒకరిద్దరూ శ్రీహరితో సీరియస్ గా మంతనాలు జరిపి, ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేశారని సమాచారం. ఒకవేళ శ్రీహరి కాంగ్రెస్ లో చేరితే టికెట్ ఆయనకి దక్కడం ఖాయమంటున్నారు. ఇదే జరిగితే నిర్మల్ సెగ్మెంట్ లో మరోసారి త్రిముఖ పోటీ ఏర్పడే అవకాశాలుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.