సొంతోళ్లను కుర్చీలో కూర్చోపెట్టేందుకు నేతల ప్లాన్లు

సొంతోళ్లను కుర్చీలో కూర్చోపెట్టేందుకు నేతల ప్లాన్లు
  • చైర్మన్‌‌, మేయర్​ పీఠాలను దక్కించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేల ప్లాన్​
  • భార్య, కొడుకు, చుట్టాలను కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిపించే ప్రయత్నం
  • ఆల్​రెడీ కొన్నిచోట్ల ‘ఏకగ్రీవాలు’     
  • కొంతమందికి కలిసిరాని రిజర్వేషన్​
  • తమ పరిస్థితి ఏందంటున్న కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ భార్యలు, కొడుకులు, చుట్టాలను కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా గెలిపించి మున్సిపల్ చైర్మన్‌‌, చైర్ పర్సన్ లుగా, మేయర్లుగా కుర్చీలో కూర్చోపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ పదవులను దక్కించుకుంటే భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఎదిగేందుకు, వారు ఎమ్మెల్యే  లేదా ఎమ్మెల్సీలు అయ్యేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బంధువులు సభ్యులుగా ఏకగ్రీవమవుతున్నారు. అయితే కొంత మంది మంత్రులకు, ఎమ్మెల్యేలకు రిజర్వేషన్లు కలిసి రాకపోగా, మరి కొంత మంది నేతల ప్రతిపాదనలను పార్టీ అంగీకరించకపోవటంతో వెనక్కి తగ్గారు.

వీళ్లు కన్ఫర్మ్​?

నగర శివారులోని దుండిగల్ మున్సిపాలిటీలో 26 వార్డులో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తమ్ముడు  కృష్ణ  ఏక్రగీవం అయ్యారు. మున్సిపల్ చైర్మన్ గా కృష్ణ పేరు దాదాపుగా ఖాయమైనట్లే అని పార్టీలో చర్చ జరుగుతోంది.

పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోడలు మమతా రెడ్డి 21వ వార్డు నుంచి ఏకగ్రీవ మయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి జనర ల్ మహిళకు రిజర్వ్ కావటంతో చైర్మన్ కాబో యేది ఎమ్మెల్యే కోడలే అని చర్చ జరుగుతోంది.

వీరికి అదృష్టం కలిసివస్తే పదవి పక్కా

మంథని మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ పుట్ట మధు భార్య పుట్ట శైలజ చైర్​పర్సన్​అభ్యర్థి రేసులో ఉన్నారు.

బోధన్ ఎమ్మెల్యే షకీల్ భార్య అయేషా ఫాతిమాను  చైర్​పర్సన్​ చేయాలనే పట్టుదలతో ఎమ్మెల్యే ఉన్నారు.

సంగారెడ్డి కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల రేసులో ఉన్నట్టు సమాచారం.

రామగుండం కార్పొరేషన్​ఎన్నికల్లో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య భార్య తార పోటీ చేస్తున్నారు. ఇదే పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తన కోడలు లావణ్యను పోటీలో నిలిపారు.

అంతా వారే అయితే మేము…

మున్సిపల్ , కార్పొరేషన్​ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు తమ వారసులను, బంధువులను బరిలోకి దింపుతుండటంతో ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇన్నేళ్లు పార్టీ కోసం పనిచేసి, పార్టీ జెండా మోసిన తమకు ప్రతి ఎన్నికల్లోనూ నిరాశే ఎదురవుతోందని కిందిస్థాయి నేతలు అంటున్నారు.

మిస్సయింది వీరికే 

బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గా తన తమ్ముడు శంభురెడ్డిని చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నించినప్పటికి బీసీలకు రిజర్వ్​చేశారు. దీంతో వైస్ చైర్మన్ అయినా దక్కించుకోవాలని చూస్తున్నారు.

సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గా మంత్రి జగదీష్ రెడ్డి భార్య అవుతారని ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ పాంప్లెంట్స్​ ప్రింట్ చేసినప్పటికీ చివరి నిమిషంలో పోటీ చేయటం లేదని ప్రకటించారు.

తన తమ్ముడిని ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ చేయాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ట్రై చేసినా.. బీసీలకు రిజర్వ్​ చేయడంతో ఆయన ఆశ వదులుకున్నారు.

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కొడుకును అదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ చేయాలని అనుకున్పప్పటికీ పార్టీ ఒప్పుకోలేదని సమాచారం. జిల్లా పరిషత్ చైర్మన్ చేయాలనుకున్నా కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు.

Ministers, MLAs plan to secure chairman, mayor seats