
- నివాళులర్పించిన మంత్రులు పొన్నం, అడ్లూరి
కోహెడ, వెలుగు: మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన కర్ర శ్రీహరి(83) కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రీహరి మొదట సర్పంచ్‌గా, ఎంపీపీ, జడ్పీటీసీ, సింగిల్ విండో చైర్మన్‌గా పని చేశారు. నేటి హుస్నాబాద్ నియోజకవర్గంలోని నాటి ఇందుర్తి నియోజకవర్గం టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
తర్వాత టీఆర్ఎస్లో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ర్ట కార్యదర్శిగా ఉన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శ్రీహరి పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్ కుమార్, పుట్ట మధు, కొరుకంటి చందర్, జీవీ రామకృష్ణ, దేవిశెట్టి శ్రీనివాస్‌రావు, మాజీ ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు.