తాడ్వాయి, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల మేడారం పర్యటన నేపథ్యంలో శనివారం మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వనదేవతల సన్నిధిలో జరిగే క్యాబినెట్ మీటింగ్ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు అలర్ట్ గా ఉండాలని, ఆలయ ప్రాంగణ పనులను వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కమాండ్ కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు. జాతర సందర్భంగా 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, కట్టుదిట్టమైన భద్రత కొనసాగిస్తున్నట్లు ఎస్పీ రామ్ నాథ్ కేకన్ వివరించారు. కలెక్టర్ దివాకర టీ ఎస్, భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఓఎస్ డీ శివం ఉపాధ్యాయ, ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్ బట్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ ఇర్పా సుకన్య సునీల్ ఉన్నారు.
మేడారంలో ట్రాఫిక్ డైవర్షన్
సీఎం రేవంత్ రెడ్డి మేడారం రాకతో పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ విధించారు. తాడ్వాయి నుంచి మేడారానికి భక్తులకు అనుమతి లేదని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ తెలిపారు. మేడారం గద్దెల వద్దకు వచ్చే భక్తులు ములుగు, గోవిందరావుపేట, పస్రా మీదుగా నార్లాపూర్ నుంచి మేడారం చేరుకోవాలని సూచించారు.
