బలహీన వర్గాల అభ్యున్నతికి సర్వాయి పాపన్న కృషి

బలహీన వర్గాల అభ్యున్నతికి సర్వాయి పాపన్న కృషి

సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ప్రధాన కారకుడు శ్రీనివాస్ గౌడ్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ వచ్చే వరకు సర్ధార్ పాపన్న గురించి చాలా మందికి తెలియదన్నారు. రవీంద్ర భారతిలో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకల్లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పేద, బడుగు బలహీన వర్గాల కోసం సర్వాయి పాపన్న ఎంతో పోరాడారని చెప్పారు. గౌడ కులంలో జన్మించి కులానికి న్యాయం చేస్తున్న వ్యక్తి  శ్రీనివాస్ గౌడ్ అంటూ ప్రశంసించారు.

దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయని తలసాని అన్నారు. గంగుల కమలాకర్ బీసీ సంఘాల కోసం పోరాడుతున్నారని చెప్పారు. గౌడన్నలు యూనిటీగా ఉంటే శ్రీనివాస్ గౌడ్ తోడుంటారని.. తాను, గంగుల కూడా అండగా నిలబడతామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఇన్ని కుల వృత్తులను గుర్తించలేదు..కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నట్లు తెలిపారు. 

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట - గంగుల

తెలంగాణ వచ్చిన తర్వాత వెనుకబడిన కులాలు ఆత్మ గౌరవంగా బతుకుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ సర్ధార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సాహసమే ఊపిరిగా బతికిన మహానాభావుడు మన గడ్డ మీద పుట్టడం అదృష్టమని చెప్పారు. సర్వాయి పాపన్న ఒక కులానికి చెందిన వ్యక్తి కాదని.. తెలంగాణ ఆస్తి అని గంగుల అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున 5వేల కోట్లతో ఆత్మ గౌరవ భవనాలు నిర్మించుకొంటున్నామని చెప్పారు.