మాకు కావాల్సింది చెక్ కాదు.. నిందితుడి ఎన్‌కౌంటర్

మాకు కావాల్సింది చెక్ కాదు.. నిందితుడి ఎన్‌కౌంటర్

హైదరాబాద్: సైదాబాద్‌లో చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు చిన్నారి తల్లిదండ్రులకు రూ. 20 లక్షల చెక్కును అందజేశారు. బాలిక కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే, మంత్రుల తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. మంత్రులు ఎటువంటి సమాచారం లేకుండా హడావుడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు. మరోవైపు మంత్రుల సాయాన్ని బాలిక కుటుంబ సభ్యులు తిరస్కరించారు. రూ. 20 లక్షల చెక్కు తమకు అవసరం లేదని.. చెక్కును వెనక్కి ఇచ్చేస్తామని తెలిపారు. తమకు న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు.

డబ్బులు వద్దు.. నిందితుడి ఎన్‌కౌంటర్ కావాలె
హోం మినిస్టర్ చెక్ ఇస్తామన్నా తాము తీసుకోలేదని చిన్నారి తండ్రి అన్నారు. తమకు చెక్ వద్దని.. ఆ దుర్మార్గుడు కావాలని, అతడ్ని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మంత్రులు ఇచ్చిన చెక్‌‌ను మీడియా ముఖంగా తిరిగి ఇచ్చేస్తామని బాధితురాలి తండ్రి చెప్పారు. ‘కలెక్టర్ గారు ఈ చెక్‌ను మీరు తీసుకోండి. మాకు కావాల్సింది చెక్ కాదు.. నిందితుడి ఎన్‌కౌంటర్. ఈ చెక్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకో రూ. 20 లక్షలు అదనంగా ఇచ్చినా మాకు అవసరం లేదు. నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేస్తామని పోలీసులు ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదు. డబ్బులు వద్దు. మాకు న్యాయం కావాలి’ అని చిన్నారి తండ్రి పేర్కొన్నారు.