అభివృద్ధిని మరిచి ప్రకటనలకే..కోట్లు వృథా చేసిన్రు : మంత్రి వివేక్

అభివృద్ధిని మరిచి ప్రకటనలకే..కోట్లు వృథా చేసిన్రు :  మంత్రి వివేక్
  • మున్సిపల్​ మంత్రిగా ​హైదరాబాద్​కు కేటీఆర్ చేసిందేమీ లేదు: మంత్రి వివేక్ 
  • జూబ్లీహిల్స్​అభివృద్ధికిమేం కట్టుబడి ఉన్నం  
  • ప్రత్యేక నిధులు తెచ్చిడెవలప్​ చేస్తామని వెల్లడి 
  • మంత్రులు పొన్నం, తుమ్మలతో కలిసి నియోజకవర్గంలో పర్యటన

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో​ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. నగర అభివృద్ధిని మరిచి, బీఆర్ఎస్ ప్రమోషన్ కోసం జాతీయ పత్రికల్లో ప్రకటనలకు రూ. వెయ్యి కోట్లు ఇచ్చి నిధులను వృథా చేశారని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. ఇలాంటి వృథా ఖర్చులు పెట్టి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు.

 వారి పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలనే అంశంపైనే దృష్టి పెట్టారని అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ నియోజకర్గంలోని పలు వార్డుల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్​రావుతో కలిసి వివేక్​ పర్యటించారు. సుమారు రూ.5 కోట్ల 12 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఎక్కడికి వెళ్లినా నాలాలు, సీసీ రోడ్లు, తాగునీటి సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. 

వీటితో పాటు ఇతర సమస్యలేమున్నా తమ దృష్టికి తీసుకొస్తే ప్రత్యేక కేటాయింపులతో పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇంతకు మందటి సమస్యలను కూడా పరిష్కరించాలని కలెక్టర్ కు ఆదేశాలిచ్చామని చెప్పారు. కృష్ణా నగర్ లో వర్షం పడ్డప్పుడు వరద సమస్య ఉందని కార్పొరేటర్ సీఎన్ ​రెడ్డి తన దృష్టికి తేవడంతో డ్రైన్ వాటర్ కోసం ప్రత్యేక లైన్ వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.   

ఉప ఎన్నిక రాగానే బయటకు వస్తున్నరు: పొన్నం  

గత పదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోని వాళ్లు ఉప ఎన్నిక రాగానే బయటకు వస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కొందరు ట్రబుల్ షూటర్లమంటూ వస్తున్నారని.. వాళ్లు గడిచిన పదేండ్లలో జూబ్లీహిల్స్ కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టిందన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి దిశగా ఆలోచించి కాంగ్రెస్ ను గెలిపించారని.. ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందని చెప్పారు. 

హైదరాబాద్ సిటీని నంబర్ వన్ చేస్తం: తుమ్మల

హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటీగా మారిందని మంత్రి తుమ్మల అన్నారు. కేంద్రం సహకరించకపోయినా సిటీని నంబర్ వన్​గా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్తులో బెంగళూరు, చెన్నైని మించి హైదరాబాద్​కు మంచి పేరు వస్తుందని చెప్పారు. ఏడాదిన్నరగా సీటిని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ కష్టపడుతున్నారని తెలిపారు. మంచినీటి సమస్యను తీరుస్తూ, రోడ్లను డెవలప్ చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు తీసుకోబోయే నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తుందని తెలిపారు.  

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

షేక్ పేట్ వార్డులో రూ.315.90 లక్షల వ్యయంతో ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ పార్క్ కు, కమ్యూనిటీ డెవలప్మెంట్, ఫుట్ పాత్​తో పాటు హరిజన బస్తీ వద్ద సీసీ రోడ్ల నిర్మాణాలకు మంత్రులు వివేక్​ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. వెంగళ్​రావు నగర్ వార్డులో గురుద్వార్ కమాన్ వద్ద 100.5 లక్షల వ్యయంతో  చేపట్టనున్న సీసీ రోడ్ల  పనులనూ ప్రారంభించారు. 

యూసఫ్ గూడ వార్డులో రూ.95.75 లక్షల వ్యయంతో కమలాపురి అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ పక్కన చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్​ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ హరిచందన, అధికారులు పాల్గొన్నారు.