
హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ ఆఫీసులో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ చీఫ్ రాంచందర్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం మాట్లాడుతూ.. నాటి కేంద్ర హోం మంత్రి వల్లభాయ్ పటేల్ ‘ఆపరేషన్ పోలో’తో తెలంగాణను భారత్‌లో విలీనం చేశారని గుర్తుచేశారు.
విమోచనం వెనుక బైరాన్‌పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వంటి ప్రాంతాల్లో పోరాడిన అనేకమంది త్యాగాలు ఉన్నాయన్నారు. మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు ‘ముక్తి దివస్’గా అధికారికంగా జరుపుకుంటుంటే, తెలంగాణలో గత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వేడుకలను నిర్వహించిందన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు పాల్గొన్నారు.
ప్రధాని మోదీపై పుస్తకావిష్కరణ
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు రచించిన ‘నరేంద్ర మోదీ – విప్లవాత్మక ప్రపంచ నాయకుడు’ అనే త్రిభాషా పుస్తకాన్ని రాంచందర్ రావు రిలీజ్ చేశారు. ఈ పుస్తకం మోదీ రాజకీయ ప్రస్థానం, ఆర్థిక సంస్కరణలు, సామాజిక న్యాయం, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలను వివరిస్తుందని తెలిపారు.
బీజేపీ ఓబీసీ మోర్చా, విశ్వకర్మ సెల్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఆఫీసులో హోమం నిర్వహించారు. రాంచందర్ రావు మాట్లాడుతూ.. విశ్వకర్మలను ‘ఆర్కిటెక్ట్ ఆఫ్ గాడ్’గా అభివర్ణించారు.