
తల్లాడ, వెలుగు : భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా తల్లాడ తహసీల్దార్‌తో పాటు మరో ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం... తల్లాడ మండలానికి చెందిన ఓ రైతు తనకు ఉన్న 15 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని తహసీల్దార్ వంకాయల సురేశ్‌కుమార్, ఆర్‌ఐ మాలోత్ భాస్కర్‌నాయక్, భూభారతి ఆపరేటర్ శివాజీ రాథోడ్‌ను కలిశాడు.
పని పూర్తి చేసేందుకు రూ. 12 వేలు ఇవ్వాలని ఆఫీసర్లు డిమాండ్ చేయడంతో రూ. 10 వేలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకున్నాడు. తర్వాత ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు బుధవారం (సెప్టెంబర్ 17) తహసీల్దార్, ఆర్‌ఐ, ఆపరేటర్‌ను కలిసి రూ. 10 వేలు ఇచ్చాడు.
అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ముగ్గురినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.