విలీన దినోత్సవంతో బీజేపీ రాజకీయం..ఉనికి కోసమే పరేడ్ గ్రౌండ్లో ఆ పార్టీ సభ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

విలీన దినోత్సవంతో బీజేపీ రాజకీయం..ఉనికి కోసమే పరేడ్ గ్రౌండ్లో ఆ పార్టీ సభ : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     బీసీల కోసం ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తానని వెల్లడి
  •     గాంధీ భవన్​లో జాతీయ పతాకావిష్కరణ

హైదరాబాద్, వెలుగు: విలీన దినోత్సవాన్ని బీజేపీ రాజకీయం చేస్తున్నదని, రాష్ట్రంలో ఉనికి కోసమే పరేడ్ గ్రౌండ్​లో ఆ పార్టీ సభ పెట్టిందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. సెప్టెంబర్​ 17 సందర్భంగా బుధవారం గాంధీ భవన్​లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించి, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత చిట్ చాట్ చేశారు. ‘‘అసలు బీజేపీ పుట్టింది 1980లో. ఆ పార్టీకి దేశ స్వాతంత్ర్యం, తెలంగాణ విలీనంతో సంబంధం లేదు. 

ఇది పాత బీజేపీ కూడా కాదు. 2014లో పుట్టిన మోదీ, అమిత్ షా బీజేపీ. వీళ్లకు అసలు చరిత్రను వక్రీకరించడం మాత్రమే తెలుసు” అని మండిపడ్డారు. ‘‘గాంధీని గౌరవించని బీజేపీ నేతల నుంచి దేశ భక్తి నేర్చుకోవడమా? గాడ్సేను దేవుడిగా చూసే వారి నుంచి దేశభక్తి నేర్చుకోవడం వృథా. సర్ధార్ పటేల్ పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ.. ఆయన చేసిన తెలంగాణ విలీనాన్ని కూడా విమోచనగా పిలవడం పటేల్ ను అవమానించడమే” అని పేర్కొన్నారు.

 ‘‘హైదరాబాద్ మాదిరిగానే గుజరాత్​లోని ఝునాగఢ్​ విలీనమైంది. మరి దానిపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడరు? రజాకార్లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఏనాడైనా వ్యతిరేకించిందా? రజాకార్లను వ్యతిరేకించిన చరిత్ర కాంగ్రెస్​దే” అని తెలిపారు. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ మ్యాచ్ ఎందుకు జరిగిందని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడైన బీసీసీఐ అధ్యక్షుడు జై షా దీన్ని ఎందుకు నిర్వహించారని, ఇదేనా బీజేపీ దేశభక్తి అని ఆయన నిలదీశారు. 

తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్నను గౌరవిస్త

రాష్ట్రంలో బీసీల కోసం ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తామని, బలహీనవర్గాల కోసం పోరాడే నాయకుడిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గౌరవిస్తానని పీసీసీ చీఫ్​ మహేశ్ గౌడ్ అన్నారు. అయితే ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ కాంగ్రెస్​ నిర్ణయాన్ని వ్యతిరేకించినందునే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

 కవితకు విలీన దినోత్సవానికి ఏం సంబంధమని.. చరిత్ర తెలుసుకొని మాట్లాడాలన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ చాలా విషయాలు ఓపెన్ గా మాట్లాడుతారని, వారు మాట్లాడే ప్రతి విషయాన్ని తప్పుడు భావంతో చూడరాదన్నారు. అందులోనూ కాంగ్రెస్ లో స్వేచ్ఛ కొంత ఎక్కువేనని.. అలా అని పార్టీ లైన్ ఎవరు దాటినా వేటు తప్పదని మహేశ్ గౌడ్ హెచ్చరించారు.