పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు.. లబ్ధిదారుల్లో టెన్షన్

పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు..  లబ్ధిదారుల్లో టెన్షన్
  • కొత్త అభ్యర్థులు పాత లిస్ట్​లు మారుస్తారన్న ప్రచారం
  •     బాపురావు పార్టీ మార్పు ప్రచారంతో ఆయన వద్దకు పరుగులు
  •     ఖానాపూర్​లో ఆగిపోయిన మైనార్టీ, బీసీ బంధు జాబితా
  •     కొత్త జాబితాలు తయారు చేయిస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్​లో ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే ప్రచారం జరగడంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల అమలుకు బ్రేక్ ​పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, బోథ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ సిట్టింగ్​లను కాదని అభ్యర్థులను మార్చింది.  టికెట్ ​ప్రకటించినప్పుడే తీవ్ర మనస్తాపం చెందిన ఖానాపూర్​ ఎమ్మెల్యే రేఖా నాయక్ ​పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె పార్టీ మారనున్నట్లు అప్పటి నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బోథ్​ఎమ్మెల్యే సైతం బీఆర్​ఎస్​ను వీడుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో పథకాల కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది.బీఆర్​ఎస్​ నుంచి టికెట్​ పొందిన లీడర్లు పాత లిస్ట్​ను ఆపేసి.. కొత్త లిస్ట్​ తయారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

బోథ్ నియోజకవర్గంలో గతంలో దళితబంధు కోసం కొంత మంది లబ్ధిదారుల నుంచి బీఆర్ఎస్ లీడర్లు డబ్బులు వసూలు చేయగా.. ఇప్పుడు సదరు లబ్ధిదారులు ఎమ్మెల్యే ఇంటికి పరుగులు తీస్తున్నారు. తమ పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరుల వద్ద వాపోతున్నట్లు తెలుస్తోంది.

పైసలిచ్చినోళ్లు పరేషాన్..

ముఖ్యంగా దళితబంధు పథకం కోసం లబ్ధిదారుల నుంచి కొంత మంది ఎమ్మెల్యే వర్గీయులు రూ.1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు వసూలు చేసినట్లు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. పైసలిచ్చినోళ్ల పేర్లతోనే జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఇక ఎలాగైనా ఎమ్మెల్యే తమకు దళితబంధు ఇప్పిస్తారనే ఇన్ని రోజులుగా ఆశతో ఉన్న లబ్ధిదారులు ఇప్పుడు పార్టీ మారుతున్నట్లు తెలియడంతో ఆయన వద్దకు పరుగులు తీస్తున్నారు. మంగళవారం సైతం నియోజకవర్గానికి చెందిన కొంత మంది లబ్ధిదారులు ఎమ్మెల్యేని కలిసి తమ పేర్లు దళిత బంధు జాబితాలో ఉండేలా చూడాలని కోరినట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల వద్ద డబ్బులు వసూలు చేశారన్న కారణంగానే బాపూరావును మార్చారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 

దీంతో ఆయన స్థానంలో టికెట్ ను అధిష్ఠానం అనిల్ జాదవ్ కు అప్పగించింది. దీంతో అనిల్​జాదవ్ లబ్ధిదారుల​పాత జాబితాలను రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు బాపూరావు పార్టీ మారుతున్నట్లు ప్రకటించడంతో జాబితా పూర్తిగా ఆగిపోయే అవకాశం ఉంది.

ఆగిన జాబితాలు..

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు సైతం పార్టీ టికెట్​ఇవ్వకుండా మొండి చేయి చూపింది. ఆమె స్థానంలో కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ కు కేటాయించింది. టికెట్ దక్కకపోవడంతో రేఖా నాయక్ తిరుగుబాటు చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాకుండా ఆపేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, ఖానాపూర్​నియోజకవర్గానికి గతంలో తయారు చేసిన బీసీ, దళిత, మైనార్టీ బంధు లబ్ధిదారుల జాబితాలు ప్రస్తుతం ఆగిపోయినట్లు సమాచారం. 

ఈ రెండు నియోజకవర్గాల్లో టికెట్ కేటాయించిన అభ్యర్థులు చెప్పిన ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో ఆశావహులు ఆందోళనకు గురవుతున్నారు. పథకాలు ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేసిన లీడర్లు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండడంతో తమకు అన్యాయం జరుగుతోందని ఆశావహులు లబోదిబోమంటున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ లీడర్ల వద్దకు వెళ్లుండగా వారినుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఈ విషయంపై పలువురు ఆశావహులు బోథ్ ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నట్లు సమాచారం.