ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన సడలింపు

ఇంటర్ పరీక్షల్లో నిమిషం నిబంధన సడలింపు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియేట్ పబ్లిక్​పరీక్షల్లో అమలవుతున్న నిమిషం నిబంధనను సడలించింది. నిర్ణీత టైమ్​ ఉదయం 9గంటల తర్వాత.. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షాల కేంద్రంలోకి అనుమతిస్తామని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతిఓజా ప్రకటించారు. ప్రస్తుతం ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకూ పరీక్షలు కొనసాగుతుండగా.. విద్యార్థులు 8.45 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 

ఈ అంశాలన్ని పరిగణనలోకి తీసుకోవాలని డీఐఈఓలు, నోడల్ ఆఫీసర్లు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీచేశారు. కాగా..ఇంటర్ పరీక్షల నిర్వహణలో  అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను సీఎస్ శాంతి కుమారి హెచ్చరించారు. శుక్రవారం ఆమె కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  రాష్ట్రంలో అన్ని రకాల పరీక్షలను సజావుగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని, ఈ విషయంలో కలెక్టర్లు ప్రణాళికాతో  పనిచేయాలని సీఎస్ సూచించారు. 

ఈ నెల 4 నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్

రాష్ట్రంలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను ఈ నెల 4 నుంచి మొదలుపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. నాలుగు విడతల్లో స్పాట్ చేపట్టేందు కు అధికారులు షెడ్యూల్ రెడీ చేశారు. తొలుత ఈ నెల 4న సంస్కృతానికి సంబంధించిన వాల్యుయేషన్ ప్రారంభం కానున్నది. 16 నుంచి ఫస్ట్ స్పెల్ ప్రారంభమవుతుండగా, దాంట్లో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టుల వాల్యుయేషన్ మొదలుకానున్నది. ఈ నెల20 నుంచి ప్రారంభమయ్యే సెకండ్ స్పెల్​లో ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులకు, ఈనెల 22న మొదలయ్యే థర్డ్ స్పెల్​లో కెమిస్ర్టీ, కామర్స్ సబ్జెక్టులకు సంబంధించిన వాల్యుయేషన్ ప్రారంభించనున్నారు. ఈ నెల 24 నుంచి ఫోర్త్ స్పెల్ లో హిస్టరీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల పేపర్ల వాల్యువేషన్ స్టార్ట్ కానున్నది.