మాల్ పేరుతో మంత్రి సబిత ప్రజాధనం లూటీ చేస్తున్నారు

మాల్ పేరుతో మంత్రి సబిత ప్రజాధనం లూటీ చేస్తున్నారు

రంగారెడ్డి జిల్లా : మంత్రాల చెరువులో షాపింగ్ మాల్ పేరుతో ప్రజాధనం లూటీ చేయడానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కంకణం కట్టుకున్నారని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఆ డబ్బులను కార్పొరేటర్లు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మంత్రాల చెరువులో వీధి వ్యాపారుల కోసం షాపింగ్ మాల్ నిర్మించాలనుకుంటున్న స్థలం చాలా చిన్నదని, తాము చూపించబోయే ప్రభుత్వ స్థలంలో మాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు.

తన అనుచరులు, కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే మంత్రి సబిత ఎఫ్ టీఎల్ ప్రాంతంలో మాల్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారని సామిడి గోపాల్ రెడ్డి  ఆరోపించారు. ఈ ప్రాంతంలో హై టెన్షన్ వైర్లు ఉంటే ఎలా నిర్మాణాలు చేస్తారని ప్రశ్నించారు. అధికారులకైనా కనీసం ఆలోచన లేకపోవడం బాధాకరమని, మంత్రి ఆదేశాలను పాటించాలనే ఉద్దేశంతోనే తప్పుల మీద తప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘జిల్లెలగూడ ప్రభుత్వ పాఠశాలలో షాపుల కోసం గుంతలు తీయడం మీ కార్పొరేటర్లకు దోచిపెట్టడం కాదా..? ఇలాంటి పరిణామాలు ఇకనైనా మానుకొని ప్రజలకు అవసరమైన సేవలు చేయండి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు మీరు గురికాక తప్పదు’ అని  సామిడి గోపాల్ రెడ్డి హెచ్చరించారు. 

మంత్రి సబితపై తీగల కృష్ణారెడ్డి ఆరోపణలు

రెండు రోజుల క్రితం మంత్రి సబితపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, చెరువులు, స్కూల్ స్థలాలను కూడా వదలడం లేదన్నారు. మీర్పేట్ ప్రాంతాన్ని సబిత నాశనం చేస్తున్నారంటూ మంత్రాల చెరువును పరిశీలించిన సందర్భంగా తీగల ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తి చేయలేదన్నారు. మంత్రి అరాచకాలపై చూస్తూ ఊరుకోనని..అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని తీగల కృష్ణ రెడ్డి హెచ్చరించారు. తమ పార్టీ నుంచి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని.. సీఎంతో మాట్లాడతానని చెప్పారు. 

తీగల ఆరోపణలపై మంత్రి సబిత స్పందన

తీగల కృష్ణారెడ్డి ఆరోపణలపైమంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా స్పందించారు. తీగల కృష్ణారెడ్డి ఎందుకు అలా మాట్లాడారో తనకు తెలియదన్నారు. అదేమంత పెద్ద ఇష్యూ కాదని, భూకబ్జా ఆరోపణలపై తీగలను కలిసి మాట్లాడతానని చెప్పారు. తాను భూ కబ్జాలకు పాల్పడినట్లు అనిపిస్తే విచారణకు సిద్ధమని సవాల్ విసిరారు. కబ్జాలకు పాల్పడితే రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని, తప్పకుండా తనపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు. తీగల కృష్ణారెడ్డిని ఎవరో మిస్ గైడ్ చేసి ఉంటారని అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలానికి వచ్చిన సబిత ఈ కామెంట్స్ చేశారు.