మిర్యాలగూడలో రెండు శాఖల మధ్య వివాదం

మిర్యాలగూడలో రెండు శాఖల మధ్య వివాదం

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్వార్టర్స్ లో  ఉన్న కార్యాలయ భవనంపై రెండు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం మంగళవారం వాగ్వాదానికి దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేసి, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మిర్యాలగూడలో ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్న సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఎన్ఎస్పీ క్వార్టర్స్ కు మార్చాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అదే భవనంలో ఎన్ఎస్పీ డివిజన్ కార్యాలయం కొనసాగుతోంది.  కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని చెబుతూ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది భవనాన్ని ఖాళీ చేసి అప్పగించాలని కోరారు. 

అయితే తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని, కార్యాలయాన్ని ఖాళీ చేయబోమని ఎన్ఎస్పీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇరు శాఖల అధికారులు, సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఎన్ఎస్పీ డీఈ శ్రీనివాస్ మాట్లాడుతూ తమకు కలెక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఇప్పటికే ఆ భవనంలో కార్యాలయం నిర్వహిస్తున్నామని తెలిపారు.

సబ్‌ రిజిస్ట్రార్ బలరాం మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చే నెల నుంచి అద్దె చెల్లింపులు నిలిపివేస్తూ, ఎన్ఎస్పీ భవనాన్ని తమకు కేటాయిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అయితే భవనాన్ని అప్పగించకుండా ఎన్ఎస్పీ అధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చివరకు కార్యాలయం తమదేనంటూ ఇరు శాఖల సిబ్బంది భవనానికి విడివిడిగా రెండు తాళాలు వేయడం చర్చనీయాంశంగా మారింది.