
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని ఉన్న హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాంను సోమవారం రాత్రి పేల్చివేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం బోజన్నపేట, కొత్తపల్లి మధ్య హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్ డ్యాం వద్దకు దుండగులు రాత్రి పూట జిలెటిన్ స్టిక్స్, డ్రిల్లింగ్ మెషీన్‌తో వచ్చారు.
డ్యాంకు అక్కడక్కడ డ్రిల్‌తో రంధ్రాలు వేశారు. జిలెటిన్ స్టిక్స్ అమర్చి డ్యాం పేల్చే క్రమంలో స్థానిక రైతులు గమనించి వారిని వెంబడించారు. దీంతో దుండగులు అక్కడ నుంచి పారిపోయారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దుండగులు వదిలివెళ్లిన 1 జిలెటిన్ స్టిక్స్, డ్రిల్లింగ్ మెషీన్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మల్లేశ్ తెలిపారు.