బుద్ధవనంలో అందాల తారలు .. బుద్ధుడికి పూజలు.. మహాస్తూపంలో ధ్యానం

బుద్ధవనంలో అందాల తారలు .. బుద్ధుడికి పూజలు.. మహాస్తూపంలో ధ్యానం
  • నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌లో పర్యటించిన 22 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు 
  • నేడు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్.. చౌమహల్లా ప్యాలెస్‌‌‌‌లో విందు
  • హాజరుకానున్న 109 దేశాల కంటెస్టెంట్లు

నల్గొండ, వెలుగు: నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందాల భామలు సందడి చేశారు. 22 మంది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బుద్ధవనంలో పర్యటించారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సోమవారం బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని బుద్ధవనం టూర్ ఏర్పాటు చేసింది. మిస్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ పోటీల్లో పాల్గొంటున్న ఆసియా దేశాలకు చెందిన 22 మంది కంటెస్టెంట్లను ఇక్కడికి తీసుకొచ్చింది. వాళ్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో అధికారులు ఘన స్వాగతం పలికారు. 

బుద్ధుడి చరిత్రపై ప్రదర్శన..  

ఆసియా ఒషియాన దేశాలైన ఇండియా, బంగ్లాదేశ్, కాంబోడియా, మయన్మార్, వియత్నాం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, జపాన్ , కజకిస్తాన్, కిర్గికిస్తాన్, లెబనాన్, మంగోలియా, నేపాల్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, శ్రీలంక, టర్కీ, చైనా, థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్, ఆర్మేనియాకు చెందిన కంటెస్టెంట్లు బుద్ధవనాన్ని సందర్శించారు. వీళ్లు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి , మార్గమధ్యలో చింతపల్లి మండల పరిధిలోని వెల్లంకి గెస్ట్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లో కాసేపు సేద తీరారు. అక్కడి నుంచి పర్యాటక సంస్థ విజయ్‌‌‌‌‌‌‌‌ విహార్‌‌‌‌‌‌‌‌ చేరుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఫొటోలు తీసుకున్నారు. అనంతరం బుద్ధవనాన్ని సందర్శించి బుద్ధుడి పాదాలకు పూలతో పూజలు చేశారు. 

మహాస్థూపంలో జ్యోతులు వెలిగించి ధ్యానంలో పాల్గొన్నారు. అందాల భామలకు మహాస్థూపం వద్ద లంబాడా కళాకారులు ఘన స్వాగతం పలికారు. బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జరిగిన సంఘటనలను ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి వివరించారు. అనంతరం జాతకవనంలో బుద్ధుడి చరిత్రపై కళాకారులు నృత్య ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్రపవార్, ఎమ్మెల్యేలు జయవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. 

ఇయ్యాల పాతబస్తీకి.. 

మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు 109 మంది మంగళవారం పాతబస్తీలో పర్యటించనున్నారు. సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల వరకు చార్మినార్​ నుంచి చౌమహల్లా ప్యాలెస్​వరకు హెరిటెజ్​వాక్ నిర్వహించనున్నారు. వీళ్లకు పాతబస్తీలో పాపులర్ అయిన మార్ఫాతో స్వాగతం పలుకుతారు. అనంతరం చార్మినార్ సమీపంలోని చుడీబజారులో కంటెస్టెంట్లు షాపింగ్ చేస్తారు. గాజుల తయారీ విధానాన్ని పరిశీలిస్తారు.