
- పోటీలకు హాజరయ్యే120 మందితో రాష్ట్రంలోని 22 ప్రాంతాల సందర్శన
హైదరాబాద్, వెలుగు: వివిధ దేశాల నుంచి వచ్చే 120 మంది మిస్ వరల్డ్ పోటీదారులు, ప్రతినిధులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 21 పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లాలని తొలుత భావించగా, తాజాగా ఈ లిస్టులో పిల్లల మర్రిని చేర్చారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో మహుబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రిని లిస్టులో చేర్చడంతో విదేశీ అతిథులు సందర్శించే పర్యాటక స్థలాల సంఖ్య 22కి చేరింది. ముందుగా అనుకున్నదాని ప్రకారం హన్మకొండ జిల్లా కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించాల్సి ఉండగా.. ఆ స్థానంలో వేయి స్తంబాల గుడిని చేర్చారు.
మిగిలిన 20 పర్యాటక ప్రాంతాల విషయంలో ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. కాగా, మిస్వరల్డ్ పోటీలపై ఈ నెల 4వ తేదీన సీఎం రేవంత్రెడ్డి మరోసారి అధికారులతో సమావేశం కానున్నారు. అందాల పోటీల వేదికల వద్ద ఏర్పాట్లు, విదేశీ అతిథుల బస, వసతి సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఏర్పాట్లను సమన్వయం చేసుకునేందుకు ప్రభుత్వం త్వరలో ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు తెలిసింది.