డిసెంబర్ 26న రంగంలోకి క్షిపణి విధ్వంసక ‘ఐఎన్‌‌ఎస్ ఇంఫాల్‌‌’!

డిసెంబర్ 26న రంగంలోకి క్షిపణి విధ్వంసక ‘ఐఎన్‌‌ఎస్ ఇంఫాల్‌‌’!

న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ‘ఐఎన్‌‌ఎస్ ఇంఫాల్‌‌’ షిప్ మంగళవారం రంగంలోకి దిగనుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకుడు నేపథ్యంలో మన సముద్ర సామర్థ్యాన్ని పెంచుకునేలా ఇండియన్ నేవీలోకి ప్రవేశించనుంది. ముంబైలోని నేవల్ డాక్‌‌యార్డ్‌‌లో జరగనున్న కమిషనింగ్ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్‌‌ సింగ్ తదితరులు హాజరుకానున్నారని నేవీ అధికారులు తెలిపారు. కాగా, ఓ వార్‌‌‌‌షిప్‌‌కు నార్త్‌‌ఈస్ట్ రీజియన్‌‌లోని సిటీ పేరు పెట్టడం ఇదే తొలిసారి. మజ్‌‌గావ్‌‌ డాక్‌‌ లిమిటెడ్ ఈ షిప్‌‌ను నిర్మించింది. కమిషనింగ్ తర్వాత వెస్ట్రన్ నేవల్ కమాండ్‌‌లో ‘ఐఎన్ఎస్ ఇంఫాల్‌‌’ జాయిన్ కానుంది. 

బ్రహ్మోస్‌‌ మిసైల్‌‌తో..

7,400 టన్నుల బరువు, 164 మీటర్ల పొడవు ఉన్న ఐఎన్ఎస్ ఇంఫాల్‌‌ నుంచి సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లు, యాంటి షిప్ మిసైళ్లు, టార్పిడోలను ప్రయోగించవచ్చు. కంబైన్డ్ గ్యాస్ అండ్ గ్యాస్ (కోగ్యాగ్) ప్రొపల్షన్‌‌ను ఏర్పాటు చేశారు. గంటకు 50 కిలోమీటర్ల (30 నాటికల్ మైళ్లు) వేగంతో దూసుకెళ్లగలదు. ఈ నౌకలో సుమారుగా 75 శాతం స్వదేశీ కంటెంట్‌‌ ఉంటుంది. 

ఇందులో సర్ఫేస్ టు సర్ఫేస్‌‌ ప్రయోగించే బ్రహ్మోస్ మిసైళ్లు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైళ్లు, యాంటీ సబ్‌‌మెరైన్ స్వదేశీ రాకెట్ లాంచర్లు, 76 మిమీ సూపర్ రాపిడ్ గన్ మౌంట్ ఉన్నాయి. హార్బర్, సముద్రంలో సమగ్ర ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఐఎన్ఎస్ ఇంఫాల్‌‌ను అక్టోబర్‌‌‌‌ 20న ఇండియన్ నేవీకి డెలివరీ చేశారు. గత నెలలో సూపర్‌‌‌‌సోనిక్ బ్రహ్మోస్ మిసైళ్లను ఈ షిప్‌‌ నుంచి విజయవంతంగా పరీక్షించారు. షిప్‌‌లోని ఆయుధ వ్యవస్థలకు టార్గెట్ డేటాను అందించేందుకు మోడ్రన్ సర్వైలెన్స్ రాడార్‌‌‌‌ను అమర్చారు.