కేటీఆర్ ​రాజీనామా చేయాలి..బీజేపీ నేతల డిమాండ్​

కేటీఆర్ ​రాజీనామా చేయాలి..బీజేపీ నేతల డిమాండ్​

గద్వాల, వెలుగు:రాష్ట్ర ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా అందిస్తున్న మిషన్ భగీరథ నీరు ప్రజలకు విషంగా మారుతోందని బీజేపీ లీడర్లు మండిపడ్డారు. గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ఇందుకు బాధ్యత తీసుకొని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేశవ్  కూడా రిజైన్​ చేయాలన్నారు. నీటి కాలుష్యానికి బాధ్యతగా మున్సిపల్ కమిషనర్ ని సస్పెండ్ చేయాలని కోరారు. గురువారం గద్వాల మున్సిపల్ ఆఫీసును బీజేపీ లీడర్లు ముట్టడించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మండల పద్మావతి మాట్లాడుతూ.. ‘‘మున్సిపల్ మంత్రి కేటీఆర్ తన శాఖను కూడా సక్రమంగా చూసుకోలేకపోతున్నరు. మిషన్ భగీరథ నీళ్లు తాగి గద్వాల పట్టణంలో ముగ్గురు చనిపోయినా పట్టదా? వెంటనే మంత్రి కేటీఆర్​ రాజీనామా చేయాలి” అని డిమాండ్​ చేశారు. చనిపోయిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి: టీజేఎస్
చనిపోయిన కుటుంబాల్లోని అర్హులకు జాబ్​ఇవ్వాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం బాధితులను పరామర్శించారు. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని బీఎస్పీ జిల్లా ఇన్​చార్జ్​ కేశవరావు అన్నారు.