
నిధుల్లేవు.. పనులు కావు.. పథకాలు అందవు
‘మిషన్ భగీరథ కింద ఏ ఒక్క గ్రామానికీ నీళ్లు వస్తలేవు. ఎక్కడైనా ఇస్తున్నరా..? ఏదైనా ఒక్క గ్రామం పేరు చెప్పండి. కమాన్’-..
నవంబర్ 23న ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో అధికారులకు ఎమ్మెల్యే ఆత్రం సక్కు సవాల్ ఇది.
‘చాలా మంది రైతులకు రైతు బంధు రావట్లే..
అర్హులకు సంక్షేమ పథకాలు అందట్లేదు. అధికారులు పట్టించుకోరా?’.. –
నవంబర్ 21న పెద్దపల్లి జెడ్పీ సమావేశంలో టీఆర్ఎస్ జెడ్పీటీసీల ఆగ్రహం ఇది.
‘వరంగల్‌లో భగీరథ పైపులైన్ అస్తవ్యస్తంగా ఉంది. మంచి నీళ్లు రావట్లే.. డ్రైనేజీలు, రోడ్లు బాగాలేవు. ఆఫీసర్లూ ఇదేం పద్ధతి. ఇట్లైతే జనంలోకి ఎట్లా పోవాలె?’.. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మీటింగ్‌లో అధికార పార్టీ కార్పొరేటర్లు ప్రశ్నలివి.
అధికారులను టార్గెట్ చేస్తున్న, మంత్రులు టీఆర్ఎస్ లీడర్లు
రైతు బంధు సొమ్ము రాకపోవడానికి వారే కారణం
మిషన్ భగీరథ పనుల లేటూ వారిపైనే..
డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తికానిదీ వారి వల్లే అంటున్నరు
ఫండ్స్లేక ఆగిన పనులు, అందని సంక్షేమ పథకాలు
మున్సిపోల్స్ నేపథ్యంలో దీన్ని ఆఫీసర్లపైకి నెట్టే వ్యూహం
కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల తీరూ ఇదే..
ఇదో మైండ్‌గేమ్ అంటున్న రాజకీయ విశ్లేషకులు
లబోదిబోమంటున్న అధికారులు
(వెలుగు, నెట్వర్క్) రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాలు, రివ్యూ మీటింగులు.. ఇలా వేదిక ఏదైనా ఆఫీసర్లే టార్గెట్ అవుతున్నరు. మిషన్ భగీరథ పనులు జరగకపోవడానికి, రైతు బంధు సొమ్ము అందకపోవడానికి కూడా అధికారులే కారణమన్నట్టు ఫోకస్ అవుతున్నరు. ప్రతిచోటా అధికార పార్టీ లోకల్ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చివరికి మంత్రులు కూడా తప్పు ఆఫీసర్లదే అన్నట్టు మాట్లాడుతున్నరు. పనులు కాకపోవడం, పథకాలు అందకపోవడంతో జనంలో ఉన్న అసంతృప్తిని తమ మీదికి నెట్టేస్తున్నరని.. మున్సిపల్ ఎలక్షన్లు వస్తుండటంతో మీడియా దృష్టిలో పడేందుకు ఇట్లా చేస్తున్నరని ఆఫీసర్లు బాధపడుతున్నరు.
సర్కారు నుంచి నిధులు విడుదల కాకపోవడంతోనే పనులు లేటయితున్నయని, దాంట్లో తమ తప్పు ఏముందని వాపోతున్నరు. ఆర్థిక మాంద్యంతో బడ్జెట్ తలకిందులైందని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని, చాలా పథకాలకు నిధుల్లో కోతలు పడుతున్నాయని.. కానీ అధికార పార్టీ లీడర్లు మాత్రం ప్రతిదానికి ఆఫీసర్లనే తప్పుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు కలెక్టర్ స్థాయి అధికారులకు సైతం ఈ తిప్పలు తప్పడం లేదని అంటున్నారు. ఈ విషయమై స్వయంగా సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేందుకు కొందరు ఆఫీసర్లు సిద్ధమైనట్టు సమాచారం.
అన్నింటికీ కోతలే..
రాష్ట్ర సర్కారు ఆర్థిక మాంద్యం నెలకొందని చెప్తూ బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోతలు పెట్టిన విషయం తెలిసిందే. ఇరిగేషన్ బడ్జెట్‌ను రూ.25 వేల కోట్ల నుంచి రూ.8,490 కోట్లకు తగ్గించింది. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. వారు ప్రాజెక్టుల పనులు నిలిపివేసి, పెండింగ్ బిల్లుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రోడ్లు, వంతెనలు, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్, ఇతర నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లదీ ఇదే పరిస్థితి. ఈ ఏడాది ఖరీఫ్‌కుగాను రైతుబంధు కోసం బడ్జెట్లో రూ.6,900 కోట్లు కేటాయించిన సర్కారు.. రూ.5,500 కోట్లే విడుదల చేసింది. దాంతో 11.75 లక్షల మంది సొమ్ము అందలేదు. ఇక యాసంగి సీజన్ మొదలైనా ఈ దఫా సొమ్ములో ఒక్క పైసా విడుదల చేయలేదు. రుణమాఫీ కోసం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించినా రూపాయి కూడా ఇవ్వలేదు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఓటాన్ అకౌంట్లో రూ.2,400 కోట్లు కేటాయించగా.. ఫుల్బడ్జెట్ కు వచ్చేసరికి రూ.180 కోట్లకు తగ్గించింది. ఇట్లా నిధులకు కోత పడటంతో పనులన్నీ ఆగిపోయాయి. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల లేక రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనుల్లో జాప్యం జరుగుతోంది. అన్ని ట్రెజరీల్లో అనధికార ఫ్రీజింగ్ నడుస్తోంది. పెండింగ్ బిల్లులు శాంక్షన్ గాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేస్తున్నారు. ఇప్పట్లో ఎలాంటి కొత్త పనులకు ప్రతిపాదనలు పంపొద్దంటూ ఆదేశాలు వచ్చాయని స్వయంగా ఎమ్మెల్యేలే చెప్తున్నారు.
మున్సిపోల్స్ నేపథ్యంలో మైండ్‌గేమ్..!
పథకాలు సరిగా అందకపోవడం, పనుల్లో జాప్యంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇలాంటి సమయంలో మున్సిపల్ ఎలక్షన్లు వస్తుండటంతో అధికార పార్టీ లీడర్లు అలర్టయ్యారు. మిషన్ భగీరథ నీళ్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు తదితర అంశాలపై జనం నిలదీసే అవకాశం ఉండటంతో.. నెపాన్ని అధికారులపైకి నెట్టే పని పెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ దిశగానే జిల్లా, మండల పరిషత్ సమావేశాలు, సమీక్షల్లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని.. ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే పనులు ఆగిపోతున్నాయనేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఏ పనైనా.. ఆఫీసర్ల నిర్లక్ష్యమే?
మిషన్ భగీరథ కింద మెజారిటీ గ్రామాలు, పట్టణాల్లో ఇంటర్నల్ పైపులైన్ల పనులను అధికార పార్టీ నేతలే సబ్ కాంట్రాక్టులపై చేస్తున్నట్టు సమాచారం. ఆ పనుల్లో క్వాలిటీ లేదని, జాప్యం జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లకు తెలిసే ఇదంతా జరుగుతోందని, అయినా తమను బద్నాం చేస్తున్నారని ఆఫీసర్లు వాపోతున్నారు. సరిపడా ఫండ్స్ లేక రాష్ట్రవ్యాప్తంగా చాలా పట్టణాలు, గ్రామాల్లో రోడ్ల పనులు నిలిచిపోయాయని, దీనికి కూడా ఆఫీసర్లనే తప్పుపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఈ నెల 18న జరిగిన మెదక్ జెడ్పీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి అధికారులను తప్పుపట్టారు. మెదక్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు ఎన్నేండ్లకు పూర్తి చేస్తారని, మెదక్– చేగుంట రూట్లో మాందపూర్ బ్రిడ్జి నిర్మాణం ఇంకెప్పుడు పూర్తవుతుందని, మీరంతా ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల్లేక పనులు జరగడం లేదు. అయినా ఎమ్మెల్సీ అలా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక ఆఫీసర్లంతా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు..” అని ఆ మీటింగ్‌లో పాల్గొన్న అధికారి ఒకరు చెప్పారు. ఇక మద్యం ఆదాయాన్ని పెంచుకునేందుకు సర్కారు ఎక్సైజ్‌శాఖకు నెలవారీ టార్గెట్లు పెడుతోంది. దాంతో ఆబ్కారోళ్లు బెల్టుషాపులను చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. దీనిపై మహిళలు ఆందోళనకు దిగుతుండటంతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఎఫెక్ట్ పడుతోంది. దీంతో వాళ్లు ఆఫీసర్లపైకి తోసేస్తున్నారు. ఈ నెల 21న యాదాద్రి జెడ్పీ సమావేశంలో.. ప్రభుత్వ విప్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఇదే విషయమై అధికారులపై మండిపడ్డారు. జిల్లాలో బెల్టు షాపులు నియంత్రించడం లేదని, మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదనీ, వచ్చినా ఆ నీళ్లను ఎవరు తాగట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిధులివ్వకపోతే ఏం చేస్తం!
ఇటీవల నల్గొండ జిల్లాలో మంత్రి జగదీశ్‌రెడ్డి మిషన్ భగీరథపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. తమ నియోజకవర్గాల్లో పనులు స్లోగా నడుస్తున్నాయనీ, ఇంటర్నల్ పైపులైన్ పనులు, రోడ్ల రిపేర్లు పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో మంత్రి ఒక్కసారిగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో నిధులు రాకపోవడంతో వల్లే పనులు ఆలస్యం అవుతున్నాయని ఆఫీసర్లు చెప్తున్నా ఆయన వెనక్కి తగ్గలేదు. ఏది ఏమైనా సరే వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో అధికా రులంతా ఆశ్చర్యపోయారు.
నవంబర్ 23న ఆసిఫాబాద్‌లో నిర్వహించిన జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా అధికారులను ఇలాగే తప్పుపట్టారు. మిషన్ భగీరథ కింద ఏ ఒక్క గ్రామానికీ నీళ్లు రావడం లేదనీ, ఏ ఊరిలోనైనా ఇస్తున్నట్టు చూపితే అక్కడికక్కడే రాజీనామా చేస్తానని అన్నారు.
పెద్దపల్లి జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం నవంబర్ 21న జరిగింది. ఇందులో అధికార పార్టీ జెడ్పీటీసీ సభ్యులు చాలా మందికి రైతు బంధు అందడం లేదని, అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్లే రైతు బంధు జమ కావడం లేదని జెడ్పీ సభ్యులకు తెలిసినా, జనం దృష్టిలో వాళ్లు హీరోలయ్యేందుకు తమపై ఆరోపణలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఓ ఆఫీసర్ వాపోయారు.
ఏదో ఓ సమావేశంలో..
ఈ నెల 23న ఖానాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పనులు అధ్వానంగా సాగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల కారణంగానే పనుల్లో క్వాలిటీ దెబ్బతింటోందని, పైపులు లీకవుతున్నాయని ఆరోపించారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఈ నెల 19న జరిగింది. అందులో టీఆర్ఎస్ కార్పొరేటర్లు అధికారులపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వరంగల్‌లో భగీరథ పైపులైన్ అస్తవ్యస్తంగా ఉంది.. మంచి నీళ్లు రావట్లే.. డ్రైనేజీలు, రోడ్లు బాగాలేవు. ఆఫీసర్లేమో పట్టించుకోవట్లేదు. ఇట్లయితే జనంలోకి ఎలా పోతాం” అని పేర్కొన్నారు.
కోరుట్ల ఎంపీడీవో ఆఫీస్ లో నవంబర్ 26 న మధ్యాహ్నం జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో మిషన్ భగీరథ పనులపై ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని, డ్యూటీలోంచి తొలగిస్తామని అధికారులను హెచ్చరించారు.
నవంబర్ 25న జరిగిన సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకం ద్వారా సరిపడా నీళ్లు రావడం లేదని, అధికారులు ఏం చేస్తున్నారని అధికారులను తప్పుపట్టారు.
కొత్తగూడెంలోని డీఆర్డీఏ కార్యాలయంలో నవంబర్ 18న నిర్వహించిన డిస్ట్రిక్ రివ్యూ మీటింగ్‌లో మిషన్ భగీరథ పనుల నత్తనడకపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి ఆఫీసర్ల తీరుపై మండిపడ్డారు.
అక్టోబర్ 24న కామారెడ్డి జెడ్పీ తొలి మీటింగ్‌లో అధికారులపైనే ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా వంద శాతం మిషన్ భగీరథ పనులు పూర్తయినట్టు చూపితే అక్కడే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.
-సెప్టెంబర్ 23న జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ తొలి సమావేశంలో ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు చాలా మంది ఆఫీసర్లను తప్పుపట్టారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడం లేదని, తామెట్లా తిరగాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అధికారులపై విరుచుకుపడ్డారు. ‘విద్యుత్ శాఖ అధికారులు గాడిదలు కాస్తున్నారా?’ అని వ్యాఖ్యానించారు.