ఏజెన్సీ గొంతెండుతోంది...వేసవిలో బావి నీరే దిక్కు

ఏజెన్సీ గొంతెండుతోంది...వేసవిలో  బావి నీరే దిక్కు
  • కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో తాగునీటి కష్టాలు
  • గూడాలకు చేరని మిషన్​ భగరీథ నీళ్లు 
  • సప్లై అవుతున్నా ప్రాంతాల్లో మురుగు నీరు
  • పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు 

ఆసిఫాబాద్, వెలుగు:  కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో తాగునీటి ఎద్దడితో ప్రజలు అరిగోస పడుతున్నారు.  అనేక ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీరు సప్లై కావడం లేదు.  కొన్ని ప్రాంతాల్లో  సప్లై అవుతున్నా  పైప్ లైన్ లీకేజీ కారణంగా మురుగు నీరు చేరి కలుషితమై తాగడానికి పనికి రావడం లేదు. మండుతున్న ఎండల్లో మారుమూల గ్రామాల్లో బిందెడు మంచినీటి కోసం ప్రాణాలను అర చేతిలో పెట్టుకుని వ్యవసాయ బావుల నుంచి తోడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.  బావుల వద్ద నీరు చేదుకునే సమయంలో అందులో పడి మహిళలు గాయాలపాలవుతున్నారు. 

మిషన్ భగీరథ నీరు రాక ఇబ్బందులు 

చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకొడ, గంగాపుర్, రవీంద్రనగర్ గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు రావడం లేదు. ఓవర్ హెడ్ ట్యాంకులకు బోర్ల ద్వారా నీరు నింపుతున్నారు. కానీ ఇండ్లకు  సప్లయ్ కావడం లేదు.  దహెగాం మండలంలోని అయినం గ్రామంలో భగీరథ నీళ్లు అస్సలే వస్తలేవు.  కొన్ని చోట్ల పైప్ లైన్లు సరిగా వెయ్యకపోవడంతో ఈ సమస్య నెలకొంది. 

 జైనూర్ మండలంలోని గౌరీ కోలాంగూడ, జామ్ని, మార్లవాయి, రాజులగూడ, సిర్పూర్ యులోని పిట్టగూడ, రాఘపూర్, అడ్పునూర్, బాబ్జిపెట్ట, లింగాపూర్ లోని కంచనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గుంనూర్, కోలాంగూడ, గుంనూర్ కే, లొద్దిగూడ, మూతిపట్టార్ గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇక్కడ మిషన్ భగీరథ నీరు వారానికోసారి మాత్రమే వస్తోంది. 

కుమ్రంభీం ప్రాజెక్ట్  వద్ద 115 ఎంఎల్ డీ సామర్థ్యంతో నిర్మించిన ఇన్ టెక్ వెల్ నుంచి ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాలకు, మంచిర్యాల జిల్లాలోని ఏడు మండలాలకు తాగునీరు అందిస్తున్నారు.  జిల్లాలో 1144 ఆవాసాలకు గాను 1144 ఆవాసాలకు నీటి సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి  భిన్నంగా ఉంది. 

తాగు నీటి కోసం వెళ్లి బావిలో పడిన్రు  

ఈ నెల27న జైనూర్ మండలంలోని గౌరీ కోలంగూడా గ్రామానికి చెందిన ఆత్రం జైతు బాయి, సిడం మోతుబాయి, ఆత్రం సోంబాయిలు నీళ్ల కోసం వెళ్లి బావిలో పడిపోయారు.  గమనించిన స్థానికులు తాళ్ల సహాయంతో వారిని బయటకు తీశారు. స్వల్పగాయాలతో వారు బయటపడ్డారు. ఈ ఊరిలో మొత్తం35 కోలాం ఆదివాసీ కుటుంబాలున్నాయి. పైప్ లైన్ లీకేజ్ కారణంగా మిషన్ భగీరథ నీటి సప్లై ఆగిపోయింది. దీంతో ఊరి దగ్గర ఒక పాత బావి నుంచి నీళ్లు చేదుకుంటూ గొంతు తడుపుకుంటున్నారు.  ఏప్రిల్ 27 న మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి  చెందిన మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద నిరసన చేపట్టి, సర్పంచ్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.   గ్రామంలో 40  కుటుంబాలు ఉండగా ఒకే ఒక బోర్ వెల్ ఉందని అది కూడా చెడిపోవడంతో గుక్కెడు నీళ్ల కోసం గోస పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చాలా కష్టంగా ఉంది

మా ఊర్లో తాగునీటి సమస్య ఇప్పటికీ తీరడం లేదు. చాలా కష్టంగా దాహం తీర్చుకుంటున్నాం.  పాత బావి నుంచి కట్టెల పై నిల్చొని నీళ్లు తోడుతున్నాం.  భయంగా ఉంటోంది. కానీ తప్పడం లేదు. మొన్న మా ఊరిలోని ముగ్గురు మహిళలు బావిలో పడి గాయపడ్డారు.
మాడవి బొజ్జుబాయి ,

 గౌరీ కోలాం గూడ ,జైనూర్