Mission Gaganyaan: జయహో ISRO: అక్టోబర్ 21న గగన్‌యాన్‌ మొదటి టెస్ట్ ఫ్లైట్

Mission Gaganyaan: జయహో ISRO: అక్టోబర్ 21న గగన్‌యాన్‌ మొదటి టెస్ట్ ఫ్లైట్

మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక ప్రకటన చేసింది. అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ఈ ప్రాజెక్టులో కీల‌క‌మైన టెస్ట్ వెహిక‌ల్ అబోర్ట్ మిష‌న్-1 (టీవీ-డీ1) టెస్ట్ ఫ్లైట్ అక్టోబర్ 21న ఉదయం 7 నుండి 9 గంటల మధ్య నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటన చేసింది. టెస్ట్ మాడ్యూల్‌కు చెందిన ఫోటోల‌ను ఇస్రో త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో పోస్టు చేసింది. నేషనల్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం.. టీవీ-డీ1 టెస్ట్ ఫ్లైట్ (TV-D1) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. 

ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశ్యం.. TV-D1 క్రూ మాడ్యూల్‌ను సురక్షితంగా అంతరిక్షంలోకి పంపడం, తిరిగి దానిని భూమికి తీసుకురావడం. టెస్టింగ్‌లో మాడ్యూల్‌ను నింగిలోకి పంపి, మ‌ళ్లీ సురక్షితంగా భూమిపైకి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప‌రీక్షలో క్రూ మాడ్యూల్ బంగాళాఖాతంలో ల్యాండ్ అవుతుంది. అనంతరం దానిని తిరిగి పునరుద్ధరిస్తారు. పారాచూట్ల సాయంతో టీవీ-డీ1 దిగనుంది. శ్రీహ‌రికోట నుంచి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న స‌ముద్ర జలాల్లో ఆ మాడ్యూల్ ల్యాండ్‌ కానుంది. గతంలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ మాట్లాడుతూ.. టీవీ-డి1 టెస్ట్ ఫ్లైట్ తర్వాత మరో మూడు టెస్ట్ వెహికల్ మిషన్లు నిర్వహిస్తామని తెలిపారు. అంటే.. ఈ పరీక్ష విజయవంతమయ్యాక మరో మూడు కీలక టెస్ట్‌లు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది చివరలో గగన్‌యాన్‌‌ను ప్రయోగించనున్నారు.