
ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ మంగళవారం (సెప్టెంబర్ 2) తన టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సూపర్ ఫామ్ లో ఉన్న స్టార్క్ మరికొంతకాలం పొట్టి ఫార్మాట్ లో ఆడే సామర్ధ్యమున్నప్పటికీ టీ20 ఫార్మాట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. 35 ఏళ్ళ స్టార్క్ మూడు ఫార్మాట్ లలో ఆస్ట్రేలియా జట్టుకు కీలక పేసర్. రానున్న రెండు సంవత్సరాల కాలంలో ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు పెద్ద సిరీస్ లు ఆడనుంది. ఈ క్రమంలో స్టార్క్ కు పని భారం ఎక్కువ కావడం ఖాయం. ఇదంతా ఆలోచించే స్టార్క్ చాలా క్లియర్ గా టీ20 క్రికెట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
2025 చివర్లో ఆస్ట్రేలియా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్ తో జరగబోయే ఈ 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు ఆస్ట్రేలియా ఆతిద్యమిస్తోంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఆస్ట్రేలియా ముందుకు వెళ్ళడానికి చాలా కీలకం. పైగా ఇది చారిత్రాత్మక సిరీస్ కావడంతో కంగారూలు ఈ సిరీస్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. యాషెస్ ముగిసిన నెల రోజులకే టీ20 భారత్ వేదికగా వరల్డ్ కప్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత వెంటనే ఐపీఎల్ ఆడాలి. కాబట్టి స్టార్క్ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటిస్తే యాషెస్ తర్వాత అతనికి మూడు నెలల పాటు విరామం దొరుకుతుంది.
మూడు నెలలు రెస్ట్ దొరకడంతో ఐపీఎల్ 2026లో స్టార్క్ ఎలాంటి ఎలాంటి హడావుడి లేకుండా ఫ్రెష్ గా ఆడుకోవచ్చు. 2027 ప్రారంభంలో 5 టెస్ట్ మ్యాచ్ ల కోసం ఆస్ట్రేలియా.. ఇండియాకు రానుంది. 2027 చివర్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. స్టార్క్ వన్డే, టెస్ట్ ఫార్మాట్ లో సాగే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలు ఆడాలంటే ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించక తప్పదు. 35 ఏళ్ళ స్టార్క్ గతంలోనే తనకు టెస్ట్ క్రికెట్ తొలి ప్రాధాన్యత అని చెప్పిన సంగతి తెలిసిందే. మొత్తానికి పక్కా ప్లానింగ్ ప్రకారమే స్టార్క్ టీ20లకు గుడ్ బై చెప్పినట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఆస్ట్రేలియా తరపున టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా స్టార్క్ నిలిచాడు. ఆడమ్ జంపా అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 2012లో పాకిస్థాన్‌తో స్టార్క్ టీ20 అరంగేట్రం చేశాడు. 13 ఏళ్ళ కెరీర్ లో ఎన్నో మ్యాచ్ ల్లో మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్ వేశాడు. ఓవరాల్ గా తన కెరీర్ లో 65 టీ20 మ్యాచ్ లాడిన స్టార్క్.. 7.74 ఎకానమీతో 79 వికెట్లు పడగొట్టాడు. ఐదు టీ20 వరల్డ్ కప్ లు ఆడిన ఈ ఆసీస్ పేసర్.. 2021లో ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో సభ్యుడు.