సిడ్నీ: ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతి ఇచ్చింది. మోచేతి, భుజం గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న స్టార్క్.. మే 1న రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. యాషెస్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన స్టార్క్.. ఆ తర్వాత బగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఐదు మ్యాచ్‌ల్లో ఆడాడు. అయితే మోచేతి, భుజం గాయంతో జనవరి నుంచి ఆటకు దూరమయ్యాడు. ‘స్టార్క్ ఇండియాలో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. గాయాల నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతానికి మ్యాచ్ ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. పరిస్థితులు అనుకూలిస్తే రాజస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు’ అని క్రికెటర్ వర్గాలు పేర్కొన్నాయి. గత సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసిన స్టార్క్ రాకతో ఢిల్లీ పుంజుకుంటుందేమో చూడాలి.

