V6 News

ICC Test rankings: దూసుకొస్తున్న మిచెల్ స్టార్క్.. డేంజర్‌లో బుమ్రా టాప్ ర్యాంక్

ICC Test rankings: దూసుకొస్తున్న మిచెల్ స్టార్క్.. డేంజర్‌లో బుమ్రా టాప్ ర్యాంక్

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్ ప్రమాదంలో పడింది. రెండేళ్లు నెంబర్ బౌలర్ గా దూసుకెళ్తున్న బుమ్రా.. తొలిసారి తన అగ్ర స్థానాన్ని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అత్యుత్తమ ఫామ్ లో ఉండడమే ఇందుకు కారణం. బుధవారం (డిసెంబర్ 10) ఐసీసీ రిలీజ్ చేసిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో స్టార్క్ మూడో స్థానానికి దూసుకొచ్చాడు. యాషెస్ సిరీస్ కు ముందు ఆరో స్థానంలో ఉన్న ఈ ఆసీస్ స్పీడ్ స్టార్ తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ పై వికెట్ల వర్షం కురిపించి ఏకంగా మూడో స్థానానికి చేరుకున్నాడు. 

తొలి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లో కలిపి 10 వికెట్లు పడగొట్టిన స్టార్క్.. గబ్బా వేదికగా ఇటీవలే ముగిసిన రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు టెస్టుల్లో 18 వికెట్లు తీసిన స్టార్క్..కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ 852 పాయింట్లను సాధించాడు. రెండో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ (853) కంటే కేవలం ఒక పాయింట్ మాత్రమే వెనకబడి ఉన్నాడు. మరోవైపు తొలిస్థానంలో ఉన్న బుమ్రా (879) కంటే 27 రేటింగ్ పాయింట్స్ వెనకబడి ఉన్నాడు. యాషెస్ లో ఇంగ్లాండ్ తో ఆస్ట్రేలియా మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అదే సమయంలో ఇండియాకు టెస్ట్ మ్యాచ్ లు లేవు.   

ప్రస్తుతం స్టార్క్ ఉన్న ఫామ్ చూస్తుంటే బుమ్రాను వెనక్కి నెట్టి అగ్రస్థానికి దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. టీమిండియా బౌలర్లలో బుమ్రా తప్ప మరెవరూ టాప్-10లో లేరు. మహమ్మద్ సిరాజ్ 12 ర్యాంక్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి రెండు యాషెస్ టెస్ట్ లకు దూరమైన కమ్మిన్స్, హేజల్ వుడ్ ర్యాంకింగ్స్ లో వెనకపడ్డారు. కమ్మిన్స్ రెండు స్థానాలు దిగజారి ఆరో స్థానంలో.. హేజల్ వుడ్ ఒక స్థానం దిగబాకి 8 వ స్థానంలో నిలిచాడు. పాక్ స్పిన్నర్ నోమన్ అలీ, సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నోమన్ అలీ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి టాప్-5 లో స్థానం సంపాదించారు.