Mitchell Starc: స్టార్క్ మైండ్ బ్లోయింగ్ రిటర్న్ క్యాచ్.. స్పీడ్ బౌలింగ్ వేస్తూ షార్ప్‌గా అందుకున్నాడు

Mitchell Starc: స్టార్క్ మైండ్ బ్లోయింగ్ రిటర్న్ క్యాచ్.. స్పీడ్ బౌలింగ్ వేస్తూ షార్ప్‌గా అందుకున్నాడు

ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి యాషెస్ టెస్టులో నిప్పులు చెరుగుతున్నాడు. పెర్త్ వేదికగా శుక్రవారం (నవంబర్ 21) ప్రారంభమైన ఈ టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా 7 వికెట్లు తీసుకున్న ఈ పేసర్.. రెండో రోకు ఆటలో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో మరో 3 వికెట్లు పడగొట్టి ఈ మ్యాచ్ లో 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్క్ బౌలింగ్ తో తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోర్ కే ఆలౌటైన ఇంగ్లాండ్.. రెండో ఇన్నింగ్స్ లో కష్టాల్లో పడింది. ఈ టెస్టులో తన బౌలింగ్ తో ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన స్టార్క్.. ఫీల్డింగ్ లో ఒక రిటర్న్ క్యాచ్ అందుకొని ఔరా అనిపించాడు.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో స్టార్క్ క్రాలీ వికెట్ పడగొట్టి ఆసీస్ కు శుభారంభం ఇచ్చాడు. స్టార్క్ వేసిన చివరి బంతిని క్రాలీ డిఫెన్స్ ఆడాడు. నేరుగా వెళ్తున్న బంతిని స్టార్క్ డైవ్ చేసి రిటర్న్ క్యాచ్ అందుకున్నాడు. 140 కి.మీ వేగంతో ఫాస్ట్ బౌలింగ్ చేస్తూ కూడా డైవ్ చేసి ఇలాంటి రిటర్న్ క్యాచ్ అందుకోవడం గ్రేట్ అనే చెప్పాలి. స్టార్క్ పట్టిన ఈ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్స్ స్టార్క్ బౌలింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో క్రాలీని ఔట్ చేసిన స్టార్క్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే సీన్ రిపీట్ చేసి క్రాలీని రెండు ఇన్నింగ్స్ ల్లో డకౌట్ గా వెనక్కి పంపాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్‌‌ గెలిచి బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 32.5 ఓవర్లలో 172 రన్స్‌‌కే ఆలౌటైంది. హ్యారీ బ్రూక్‌‌ (52), ఒలీ పోప్‌‌ (46), జెమీ స్మిత్‌‌ (33), బెన్‌‌ డకెట్‌‌ (21) మాత్రమే రాణించారు. జాక్‌‌ క్రాలీ (0), జో రూట్‌‌ (0), స్టోక్స్‌‌ (6), అట్కిన్సన్‌‌ (1), బ్రైడన్‌‌ కార్స్ (6), ఆర్చర్‌‌ (0 నాటౌట్‌‌), మార్క్‌‌ వుడ్‌‌ (0) సింగిల్‌‌ డిజిట్‌‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌‌ స్టార్‌‌ పేసర్‌‌ మిచెల్‌‌ స్టార్క్‌‌ (7/58) కెరీర్‌‌ బెస్ట్‌‌  బౌలింగ్ చేస్తే డాగెట్‌‌ 2, గ్రీన్‌‌ ఒక వికెట్‌‌ తీశాడు. 

తర్వాత బ్యాటింగ్‌‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే టైమ్‌‌కు తొలి ఇన్నింగ్స్‌‌లో 39 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. అలెక్స్‌‌ క్యారీ (26) టాప్‌‌ స్కోరర్‌‌. కామెరూన్‌‌ గ్రీన్‌‌ (24), ట్రావిస్‌‌ హెడ్‌‌ (21), స్మిత్‌‌ (17)సహా మిగతా అందరూ ఫెయిలయ్యారు. స్టోక్స్ ఐదు వికెట్లతో చెలరేగితే కార్స్‌ మూడు.. ఆర్చర్ రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభిచిన ఇంగ్లాండ్ ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 161 పరుగుల ఆధిక్యంలో ఉంది.