ICC Player of Month: రెండేళ్ల తర్వాత ఆసీస్‌కు తొలిసారి.. RCB ప్లేయర్‌ను ఓడించి ఐసీసీ అవార్డు పట్టేసిన స్టార్క్

ICC Player of Month: రెండేళ్ల తర్వాత ఆసీస్‌కు తొలిసారి.. RCB ప్లేయర్‌ను ఓడించి ఐసీసీ అవార్డు పట్టేసిన స్టార్క్

ఆస్ట్రేలియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. స్టార్క్ ను డిసెంబర్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా గురువారం (జనవరి 15) ఐసీసీ ప్రకటించింది. స్టార్క్ తో పాటు నామినీలుగా ఉన్న వెస్టిండీస్‌కు చెందిన జస్టిన్ గ్రీవ్స్, జాకబ్ డఫీలకు నిరాశే మిగిలింది. ఇంగ్లాండ్ తో ఇటీవలే ముగిసిన యాషెస్ సిరీస్ లో ఈ ఆసీస్ బౌలర్ అత్యద్బుతంగా రాణించాడు. అడిలైడ్, మెల్ బోర్న్ టెస్టుల్లో బౌలింగ్ లో విజృంభించి 16 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు బ్యాటింగ్ లోనూ రాణించి బ్రిస్బేన్ టెస్టులో 77 పరుగులు.. అడిలైడ్ టెస్టులో 54 పరుగులు చేశాడు. ఈ సిరీస్ మొత్తం 31 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. 

రెండేళ్ల తర్వాత ఒక ఆస్ట్రేలియా ఆటగాడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకోవడం ఇదే తొలిసారి. 2023లో చివరిసారిగా పాట్ కమ్మిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. "ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికవడం గౌరవంగా ఉంది. ఈ అవార్డు యాషెస్ గెలిపించడం ద్వారా రావడంతో నాకు చాలా ప్రత్యేకంగా మారింది. మా స్వదేశీ ప్రేక్షకుల ముందు ఇంతటి ఐకానిక్ సిరీస్ గెలవడంలో పాత్ర పోషించడం గర్వంగా అనిపిస్తుంది. ఒక జట్టుగా మేము గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాము." అని స్టార్క్ అవార్డు గెలుచున్నాక చెప్పుకొచ్చాడు. 

 జస్టిన్ గ్రీవ్స్, జాకబ్ డఫీలకు నిరాశ:

డిసెంబర్ నెలలో వెస్టిండీస్ ఆల్ రౌండర్  జస్టిన్ గ్రీవ్స్ అద్భుతంగా రాణించాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో గ్రీవ్స్ మూడు టెస్టుల్లో 56.60 సగటుతో 283 పరుగులు చేశాడు. క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌ నాలుగో ఇన్నింగ్స్ లో 202 పరుగులతో డబుల్ సెంచరీ చేసి టెస్ట్ మ్యాచ్ ను డ్రా చేశాడు. బౌలింగ్ లో కూడా రాణించి ఐదు వికెట్లు పడగొట్టాడు. 

జాకబ్ డఫీ విషయానికి వస్తే వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశీ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. మూడు టెస్టుల్లో   15.43 యావరేజ్ తో 23 వికెట్లు పడగొట్టాడు. డఫీ ప్రదర్శనతో న్యూజిలాండ్ 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. అద్భుతంగా రాణించిన డఫీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించినా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించలేదు.