బీసీసీఐ ప్రెసిడెంట్‎గా మిథున్ మన్హాస్‌.. అనూహ్యంగా తెరపైకి డొమెస్టిక్ క్రికెట్ లెజెండ్..!

బీసీసీఐ ప్రెసిడెంట్‎గా మిథున్ మన్హాస్‌.. అనూహ్యంగా తెరపైకి డొమెస్టిక్ క్రికెట్ లెజెండ్..!

ముంబై: బీసీసీఐ ప్రెసిడెంట్ పోస్టుకు జరగనున్న ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ కెప్టెన్, డొమెస్టిక్ క్రికెట్ గ్రేట్ మిథున్ మన్హాస్ రేసులోకి వచ్చాడు. ఆదివారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌‎లో ప్రెసిడెంట్ పదవికి అతను నామినేషన్ దాఖలు చేశాడు. 70  ఏండ్లు దాటిన రోజర్ బిన్నీ గత నెలలో తప్పుకోవడంతో ఖాళీ అయిన ఈ పోస్టుకు 45 ఏండ్ల మన్హాస్ పేరు తెరపైకి రావడం దేశ క్రికెట్‌‎‌ను ఆశ్చర్యపరిచింది. ఢిల్లీలో జరిగిన ఓ అనధికారిక సమావేశంలో ఈ పోస్టుకు మన్హాస్ పేరును ప్రతిపాదించాలని బోర్డు పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

దాంతో తన ఎన్నిక లాంఛనమే కానుంది. అరుణ్ ధుమాల్ ఐపీఎల్‌‌‌‌‌‌‌‌చైర్మన్‌‎గా కొనసాగుతాడని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రకటించాడు. ‘వచ్చే టర్మ్ కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటున్నాం. మిథున్ మన్హాస్‌‎ను ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌చేయాలని నిర్ణయించాం. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌‎గా అరుణ్ ధుమాల్ కొనసాగుతారు’ అని పేర్కొన్నాడు. ఈ నెల 28న జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో పలు కీలక పదవులను భర్తీ చేయనున్నారు.

మన్హాస్‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర ముఖ్య పదవులకు కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. బోర్డు సెక్రటరీ దేవజిత్ సైకియా అదే పోస్టుకు పోటీ పడుతుండగా.. రోహన్ దేశాయ్ స్థానంలో ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్టుకు కర్నాటక స్టేట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రఘురామ్ భట్ బరిలో నిలిచాడు. ప్రస్తుత ట్రెజరర్ ప్రభ్‌‌‌‌‌‌‌‌తేజ్ భాటియా  జాయింట్ సెక్రటరీ పోస్టుకు పోటీ పడుతుండగా.. దిలీప్ వెంగ్‌‌‌‌‌‌‌‌సర్కార్ స్థానంలో అపెక్స్ కౌన్సిల్ మెంబర్ కోసం జైదేవ్ షా (సౌరాష్ట్ర క్రికెట్ సంఘం  ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌) నామినేషన్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశాడు. 

సుదీర్ఘ దేశవాళీ కెరీర్‌‎లో 157 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు, 130 లిస్ట్–--ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లతో పాటు 55 ఐపీఎల్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన అనుభవం మన్హాస్‌‌‌‌‌‌‌‌కు ఉంది. ఢిల్లీ క్రికెట్ వర్గాల్లో మన్హాస్‌‌‎కు తెలివైన, చాకచక్యంగా వ్యవహరించే వ్యక్తిగా పేరుంది.  సరైన సమయంలో సరైన చోట ఉండటం మన్హాస్ కెరీర్‌‌లో ప్లస్‌‌ పాయింట్స్ అని అతనికి దగ్గరగా ఉండే వాళ్లు చెబుతుంటారు. 

తన కెరీర్ ఆరంభంలో దివంగత అరుణ్  జైట్లీకి దగ్గరగా ఉండటం, సెహ్వాగ్, యువరాజ్ సింగ్ వంటి టాప్ ప్లేయర్లతో స్నేహం చేయడం వంటివి అతనికి కలిసొచ్చాయి. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక మిథున్ జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌‌ను చక్కదిద్దేందుకు పరిపాలనా బాధ్యతలు చేపట్టాడు.