
గద్వాల, వెలుగు: అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు సరిగ్గా లేవని జడ్పీటీసీలు.. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అబ్రహం సొంతపార్టీ జడ్పీ చైర్పర్సన్సరితను, అధికారులను నిలదీశారు. సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేయడంతో గురువారం జడ్పీ సమావేశం సీరియస్‌గా సాగింది. జిల్లా కేంద్రంలోని పాత ఎంపీడీఓ ఆఫీస్ మీటింగ్ హాల్లో ఈ సమావేశం చైర్మన్ సరిత అధ్యక్షతన నిర్వహించారు. ఫండ్స్ కేటాయింపు, కరెంటు సరఫరాపై తీవ్ర చర్చ జరుగగా, కరెంట్ ఆఫీసర్ల పై ఎమ్మెల్యే అబ్రహాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిధులు కేటాయింపుల రచ్చ..
అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపై వడ్డేపల్లి జడ్పీటీసీ రాజుకు, జడ్పీ చైర్మన్ సరితకు తీవ్ర వాగ్వాదం చెలరేగింది. 24 కోట్ల బడ్జెట్ వస్తే కొంతమంది జడ్పీటీసీలకే ఎక్కువ ఫండ్స్ ఇస్తున్నారని, తమకు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు. దీనిపై సరిత మాట్లాడుతూ.. తామూ ఎవరి పై వివక్ష చూపించలేదని, అందరికీ సమానంగా ఫండ్స్ ఇస్తున్నామని, సెన్స్‌తో మాట్లాడాలని బదులిచ్చారు. 70శాతం నిధుల్లో జడ్పీటీసీలకు సమాన నిధులు కేటాయించగా.. 30శాతం నిధులను స్థానిక కొందరు జడ్పీటీసీలకు ఎక్కువ కేటాయించినట్టు స్పష్టం చేశారు. దీంతో పాటు గతేడాది రైతు సమన్వయ సమితి కన్వీనర్ గా ఉన్న పెద్దారెడ్డి చనిపోగా.. ఆ పోస్ట్ కోసం ఇటీవల ఎమ్మెల్యే అబ్రహం ఒకరిని రికమండ్ చేశారని, దానికి మినిస్టర్ నిరంజన్ రెడ్డి కూడా ఎండార్స్ చేశారని, నెలలు గడుస్తున్నా ఎందుకు ఆ పోస్ట్‌లో ఎవరినీ నియమించడం లేదని సభ్యులు అగ్రికల్చర్ జిల్లా ఆఫీసర్ గోవింద్‌ను నిలదీశారు. దీంతో ఆయన స్పందిస్తూ.. ఒక్క పోస్టుకు ఇద్దరికి రికమెండేషన్లు ఉన్నప్పుడు తామేమీ చేయలేమన్నారు. అలాగే ఇసుక దోపిడీ జరుగుతున్నా పట్టించుకోవడం లేదని గ్రంథాలయ సంస్థ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. వేలి సోంపూర్ చిన్న ధన్వాడ రీజినల్ నుంచి వందల ట్రాక్టర్లు తరలుతున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. మన ఊరు మనబడి పేరుతో పర్మిషన్లు తీసుకొని అమ్ముకుంటున్నారని జడ్పీటీసీ రాములమ్మ సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు ఆర్డర్స్ ఇస్తామని, అక్రమ ఇసుక రవాణా జరుగుతుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
పనులు చేసేందుకు రాని కాంట్రాక్టులు ..
పంచాయతీరాజ్ నుంచి పనుల కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ రావడంలేదని పీఆర్ ఈఈ సమత తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే అబ్రహం స్పందిస్తూ 2017 లో 43 ఎస్డీపీ రోడ్లు మంజూరైనా ఇప్పటికి ఎందుకు కంప్లీట్ కాలేదని, బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడం వల్లే కాంట్రాక్టర్లు రావడంలేదని సమాధానం ఇచ్చారు. పైగా పీఆర్ ఈఈ నిర్లక్ష్యం వల్లే కాంట్రాక్టులు రావడం లేదని సభ్యులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జి కలెక్టర్ శ్రీహర్ష ఆలంపూర్ పాల్గొన్నారు.
క్యాంప్ ఆఫీసు కరెంట్ కనెక్షన్ ఇస్తలే
కొన్ని నెలలుగా తన క్యాంప్ ఆఫీసు కరెంట్ కనెక్షన్ ఇవ్వడం లేదని, ఆఫీసర్లను అడుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే అబ్రహం మండిపడ్డారు. నియోజకవర్గంలో కరెంటు సమస్యలపై మీటింగ్ పెడదామంటే అధికారులు తప్పించుకుంటున్నారని తెలిపారు. గ్రామాల్లోని కరెంట్ సమస్యల గురించి చెబితే పరిష్కరించడం లేదని ఆయన మండిపడ్డారు.
ఫండ్స్ లేక.. పనులు చేయట్లే : కరెంట్ డిపార్ట్మెంట్
కరెంటు శాఖలో ఫండ్స్ లేవని, ఏ పనులూ చేయలేమని ట్రాన్స్‌కో ఎస్సీ ప్రభాకర్, డీఈ మోహన్ స్పష్టం చేశారు. పల్లె, పట్టణ ప్రగతికి ఫండ్స్ రాలేదని, కనీసం పోల్స్ కూడా కొత్తవి ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర, స్కూల్ దగ్గర ఉన్న కరెంటు స్తంభాలకు పంచాయతీ వారే కంచెలు ఏర్పాటు చేసుకోవాలని, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి త్వరలోనే కరెంట్ కనెక్షన్ ఇస్తామని తెలిపారు.