సారంగాపూర్, వెలుగు: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం సారంగాపూర్ మండలం కౌట్ల( బి) లోని ఫంక్షన్ హాల్లో మండలంలోని లబ్ధిదారులకు రేషన్ కార్డుల ప్రోసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమన్నారు.
రేషన్ కార్డులు లేక ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లు,పెన్షన్లు రాని వారికి వెంటనే మంజూరు చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రేషన్ కార్డులు పేదలకు వరం లాంటివని అన్నారు. మండలంలో కొత్తగా 1425 రేషన్ కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. నిర్మల్ నియోజకవర్గంలో మొత్తం 10325 రేషన్ కార్డులు మంజూరుతో పాటు 2 వేల కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లు చేర్చినట్లు తెలిపారు.
అనంతరం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఎరువులు, విత్తనాల దుకాణాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో లక్ష్మీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాది, మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్ రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.
