రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకం : ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర చరిత్రాత్మకమని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో సోమవారం తెలంగాణ జర్నలిస్టు ఫోరం సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 31న హైదరాబాద్​లోని జలవిహార్​లో నిర్వహిస్తున్న 25 రజతోత్సవ వాల్ పోస్టర్​ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు నిరంతరం పాటుపడుతున్నారని, వారి సేవలు వెలకట్టలేనివన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజల కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బేత రమేశ్, ప్రధాన కార్యదర్శి ఎల్.రాజు, యూనియన్ నాయకులు ఎం.సంతోష్, సుభాష్, మండల జర్నలిస్టులు పాల్గొన్నారు. 

ఆటో డ్రైవర్లకిచ్చిన హామీలు నెరవేర్చాలి 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్​ చేశారు. ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులు సోమవారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్​లోని ఇందిరా పార్క్​లో నిర్వహించనున్న ‘ఆటో ఆకలి కేకల మహాసభ’ వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. 

ఆయన మాట్లాడుతూ.. కష్టంతో పూటగడిచే ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఓట్లు దండుకుందని, వారికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు రూ.5 వేలు విరాళం అందజేసి, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, శ్రీధర్ రెడ్డి, పెంటన్న, రోహిదాస్, బీఆర్​ఎస్​ నేతలు తదితరులు పాల్గొన్నారు.