ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. యాదగిరిగుట్టలోని బీర్ల నిలయంలో ఆలేరు నియోజకవర్గానికి చెందిన148 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రణాళికలతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.  అభివృద్ధి, సంక్షేమం పేరుతో మాజీ సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా అప్పులు చేసి.. వాటిని తన కుటుంబానికి ధారాదత్తం చేశారని ధ్వజమెత్తారు.

  కేసీఆర్ కారణంగా ఆగమైన రాష్ట్రాన్ని పకడ్బందీ ప్రణాళికలతో సీఎం రేవంత్ రెడ్డి గాడిన పెడుతున్నారని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్ పదేళ్లు కాలయాపన చేస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదల సొంతింటి కలను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, జిల్లా నాయకుడు దుంబాల వెంకట్ రెడ్డి, పలు మండలాల కాంగ్రెస్ నాయకులు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.